యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతల్లో
అలజడి రేగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ జూన్ 1వ తేదీ వరకూ ఉంటుందని సవాల్ విసిరిన నేపథ్యంలో అధికార పార్టీ అప్రమత్తమయింది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కొత్త ఎత్తుకు దిగేందుకు సిద్ధమవుతుంది.ముఖ్యంగా కర్ణాటక రాజకీయం మొత్తం రమేష్ జార్ఖిహోళి చుట్టూనే తిరుగుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి మంత్రి పదవిని తొలుత దక్కించుకున్నారు. అసమ్మతి స్వరం విన్పించడంతో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ముందునుంచే రమేష్ జార్ఖిహోళి బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఇటీవల బీజేపీ నేత, మాజీ కాంగ్రెస్ నేత ఎస్ఎం కృష్ణను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్ఖిహోళి, సుధాకర్ లు కలవడం చర్చనీయాంశమైంది.మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించాలని అధికార పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా అసమ్మతి నేతలను ఆపాలంటే మంత్రివర్గ విస్తరణ చేపట్టడమే మార్గమని భావిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారిని కొందరిని తొలగించి విస్తరణ జరపాలని కుమారస్వామి, సిద్ధరామయ్యలు నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీపట్ల విధేయతగా ఉన్న వారిని తొలగిస్తే వారిలో అసంతృప్తి చెలరేగదని వీరు భావిస్తున్నారు.అయితే మంత్రి వర్గ విస్తరణకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ఏర్పడిన తర్వాత ఒకసారి మాత్రమే విస్తరణ జరిగింది. ఇప్పుడు తాజాగా మంత్రివర్గ విస్తరణ జరిపితే సంకీర్ణ సర్కార్ ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుందనుకోవడం భ్రమేనంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకంటే కాంగ్రెస్ లో అసమ్మతి నేతలు పదవుల కోసం కాదని, కుమారస్వామిపై మంటతోనే పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద సిద్ధరామయ్య, కుమారస్వామి ఎత్తుగడ ఎంతవరకూ ఉపయోగపడుతుందో చూడాలి.