స్మృతి ఇరానీ… 2014లో కేంద్రమంత్రి అయ్యేంత వరకూ ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆఖరికి సొంత పార్టీలోనూ సుపరిచితం కాదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ యువనేత రాహుల్
గాంధీపై అమేధీ నుంచి పోటీ చేయడంతో ఒక్కసారి వార్తల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడినప్పటికీ జాతీయ స్థాయిలో గుర్తింపు మాత్రం లభించింది. గత ఐదేళ్లుగా కేంద్రమంత్రిగా అనేక విమర్శలు
ఎదుర్కొన్నప్పటికీ మొత్తానికి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాజాగా అమేధీ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించడం ద్వారా సంచలనం సృష్టించారు. ఆమెకు 4.48 లక్షల ఓట్లు రాగా, రాహుల్ గాంధీకి 4.13 లక్షల ఓట్లు లభించాయి. 2014 ఎన్నికల్లో ఆమెకు 3 లక్షలు మాత్రమే ఓట్లు రాగా, రాహుల్ కు 4 లక్షల వరకూ ఓట్లు వచ్చాయి. అమేధీ లోక్ సభ స్థానం పరిధిలో తిలోయి, సలోన్, జగదీశ్ పూర్, గౌరీ గంజ్, అమేధీ అసెంబ్లీ స్థానాలున్నాయి. గాంధీ కుటుంబానికి పెట్టని కోట వంటి ఈ నియోజకవర్గంలో కాంగ్రెసేతర అభ్యర్థి గెలవడం ఇది మూడోసారి. 1977లో జనతా పార్టీ రవీంద్ర ప్రతాప్ సింగ్, 1998లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంజయ్ సేన్ గెలుపొందారు. స్మృతి ఇరానీ మూడో నాయకురాలు కావడం విశేషం. గతంలో ఈ నియోజకవర్గం నుంచి రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ పోటీ చేసి గెలుపొందారు. గాంధీ కుటుంబ నియోజకవర్గం కావడంతో అమేధీ ఫలితం జాతీయ స్థాయిలో ఆసక్తిని కల్గిస్తుంది.స్మృతి ఇరాని ఈస్థాయికి చేరుకోవడం వెనక అకుంఠిత దీక్ష, కఠోరశ్రమ, వ్యూహం ఉన్నాయి. ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా రాజకీయాల్లో ప్రవేశించడం, నిలదొక్కుకోవడం, రాణించడం అంత తేలికైన విషయం కాదు. స్మృతి తండ్రి పంజాబీ. తల్లి బెంగాలి. తల్లి జనసంఘ్ సభ్యురాలు. తాత ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు. బతుకుదెరువు కోసం నటిగా, నిర్మాతగా వ్యవహరించారు. బుల్లి తెర సీరియల్లో నటించారు. సేల్స్ గర్ల్ గా పనిచేశారు. ఆమె నిరాడంబరం, నీతి, నిజాయితీ, శ్రమించేతత్వం పార్టీలో ఎదుగుదలకు తోడ్పడింది. తొలిసారి కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ పై పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిరాశ చెందలేదు. మహారాష‌్ట్ర బీజేపీ యువజన విభాగం అధ్యక్షురాలిగా, బీజేపీ కార్యదర్శిగా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేసి తన సమర్థతను చాటుకున్నారు 2011లో తొలిసారిగా రాజ్యసభ
సభ్యురాలిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. నాలుగేళ్ల పాటు పెద్దల సభలో వివిధ అంశాలపై అనర్గళంగా మాట్లాడి పార్టీ పెద్దలను ఆకట్టుకున్నారు. తన వాగ్పటిమతో ప్రతిపక్షానికి కళ్లెం వేశారు. 2014లో కేంద్రంలో బీజేపీ గెలవడంతో నేరుగా కేంద్రమంత్రి అయ్యారు. అత్యంత కీలక మైన మానవ వనరుల శాఖమంత్రిగా నియమితులయ్యారు. పీవీ నరసింహరావు, అర్జున్ సింగ్, మురళీమనోహర్
జోషి, కపిల్ సిబాల్ వంటి దిగ్గజాలు నిర్వహించిన శాఖకు సారథిగా నియమితులయ్యారు. అసలు చదువుకోని ఆమెకు ఇంతటి క్లిష్టమైన శాఖను కట్టబెట్టడంపై అప్పట్లో విమర్శలు విన్పించాయి. దానికి ఆమె ధీటుగా బదులిచ్చారు. తన విద్యార్హతలను ప్రశ్నించడంపై ఆమె ఘాటుగా స్పందించారు. “అవును నేను చదువుకోలేదు. అందుకే చదువు విలువ నాకు బాగా తెలుసు” అని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కు సంబంధించి మంత్రిపై అనేక విమర్శలు వచ్చాయి. పలు వివాదాలు చుట్టుముట్టడంతో చివరకు ఆమెను చేనేత, జౌళి శాఖకు మార్చారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక అదనంగా సమాచార, ప్రసార శాఖ బాధ్యతలను అప్పగించారు. తర్వాత ఆ శాఖ రాజ్ వర్థన్ సింగ్ రాథోడ్ కు బదిలీ అయ్యాక చేనేత, జౌళిశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.గత ఎన్నికల్లో ఓడిపోయినా…స్మృతి ఇరానీ అమేధీ నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. ఇవే నేడు ఆమె గెలుపునకు బాటలు పరిచాయి. గత ఐదేళ్లుగా రాహుల్ 17 సార్లు పర్యటించగా, ఇరానీ 21 సార్లు సందర్శించారు. వందకు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. స్థానికులకు ఈ-రిక్షాలు పంపిణీ చేశారు. వైఫై సేవలను ప్రారంభించారు. పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అమేధీకి సంబంధించి అనేక విషయాలను తరచూ ట్విట్టర్లో ప్రస్తావించేవారు. ఈ విషయంలో ఆమె రాహుల్ కంటే ఎప్పుడూ ముందుండేవారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే 2024 ఎన్నికల్లోనూ స్మృతి ఇరానీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు.