లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ చీఫ్‌గా కొనసాగేందుకు విముఖత చూపుతున్న రాహుల్ గాంధీ తదుపరి అధ్యక్షుడిగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతను ఎంపిక చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సూచించారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని సీనియర్ నేతలు రాహుల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన అందుకు సిద్ధంగా లేరని, వీలైనంత త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.గాంధీ కుటుంబానికి చెందని నేతను పార్టీ చీఫ్‌గా ఎంపిక చేయాలని రాహుల్ కోరుతుండటంతో ప్రియాంక
గాంధీకి సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం లేదని సీడబ్ల్యూసీ సభ్యుడు, అసోం మాజీ సీఎం తరుణ్ గగోయ్ పేర్కొన్నారు. పార్టీ చీఫ్‌గా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ సూచించడంతో సమర్ధుడైన నేతను వెతికే పనిలో కాంగ్రెస్ సీనియర్లు నిమగ్నమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు మిత్రపక్షాలకు చెందిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డీఎంకే చీఫ్ స్టాలిన్, జేడీఎస్ కుమారస్వామి తదితరులు కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగాలని రాహుల్‌ను కోరుతున్నా అందుకు ఆయన సిద్ధంగా లేరు.