యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు సీఎంగా జగన్ ప్రమాణం చేశారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. అలాగే వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బావ బ్రదర్ అనిల్ కుమార్‌తో ఇతర వైసీపీ ముఖ్య నేతలు వేదికపై కూర్చున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం గవర్నర్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వీడ్కోలు పలికారు. కాగా, స్టేడియంలోపలికి రాలేకపోయిన అభిమానులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా 14 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. జగన్ సభాస్థలికి చేరుకున్న సమయంలో వైకాపా నేతలు హెలికాప్టర్ ద్వారా పూలు జల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. అంతకుముందు జగన్, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని నివాసం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో తాడేపల్లి సెంటర్, వారధి మీదుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. మైదానంలో ఓపెన్ టాప్ వాహనంపై నుంచి అభిమానులకు జగన్ అభివాదం చేశారు.
జగన్ ప్రసంగం హైలైట్స్
✦ దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు. ‘కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడం. అర్హులైన ప్రతి ఒక్కరికీ నా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. వారంతా నా వల్లే అని నేను భావిస్తాను’ అని జగన్ అన్నారు.
✦ ‘మన కర్మ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉన్న మీడియా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగిలిన ఎవ్వరూ వాళ్లకు ఇంపుగా కనిపించరు. మిగిలినవాళ్లను ఎప్పుడెప్పుడు దింపాలి అంటూ వాళ్ల రాతలుంటాయి. వాళ్లందరికీ ఇదే చెబుతున్నా.. మా ప్రభుత్వం దురుద్దేశంతో వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తాం. హైకోర్టు జడ్జ్ దగ్గరకు వెళ్లి వీళ్లను శిక్షించండి అని గట్టిగా అడుగుతాం’ అని వైఎస్ జగన్ తన ప్రతికూల మీడియాను హెచ్చరించారు.
✦ ప్రభుత్వం చేపట్టే కొత్త టెండర్లలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఒక హైకోర్టు జడ్జ్ ద్వారా జ్యుడిషియల్ కమిటీ వేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అడుగుతానని జగన్ చెప్పారు. హైకోర్టు జడ్జ్‌ను జ్యుడిషియల్ కమిటీకి చైర్మన్‌ను చేస్తామన్నారు. ప్రతి కాంట్రాక్టును టెండర్లకు పంపడానికి ముందే జ్యుడిషియల్ కమిటీ వద్దకు పంపుతామని చెప్పారు. ఒకవేళ కమిటీ ఏమైనా మార్పులు చేర్పులు చెబితే అవన్నీ పూర్తిచేసిన తరవాతే కాంట్రాక్టర్లను టెండర్లకు పిలుస్తామన్నారు.
✦ అవినీతి ఆరోపణలు వచ్చిన పనులు, కాంట్రాక్టులను పూర్తిగా రద్దుచేస్తామని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారు. అవే కాంట్రాక్టలను ఎక్కువ మంది పాలుపంచుకునేలా చేస్తూ పాత నిబంధనలను పూర్తిగా మారుస్తూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఎంతెంత లంచాలు తీసుకుని కాంట్రాక్టులు చేశారో ప్రజల ముందు పెడతానని చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా మిగిలిన పనులను పారదర్శకంగా చేస్తామన్నారు.
✦ మానిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలన్నింటినీ తూచాతప్పకుండా అన్నింటినీ అమలు చేస్తామని జగన్ మరోసారి ప్రజలకు హామీ ఇచ్చారు.
✦ పింఛన్, రేషన్ కార్డ్, ఇళ్లు, ఇళ్ల స్థలం, ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ.. ఇలా నవరత్నాల్లోని ఏ పథకమైనా కావాలంటే గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జగన్ చెప్పారు. ఇలా దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో వాటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
✦ ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయనున్నట్లు జగన్ వెల్లడించారు. గ్రామానికి చెందిన 10 మందికి ఈ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మొత్తం లక్షా 60 వేల ఉద్యోగాలను గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాటికల్లా ఇస్తామని స్పష్టం చేశారు.
✦ ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వివక్ష చూపించినా, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అడిగినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పొచ్చని జగన్ ప్రజలకు సూచించారు. సీఎం ఆఫీసు నంబర్ ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు.
✦ మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన అందిస్తామన్నారు. అవినీతి లేని పాలన, వివక్షలేని పాలన అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రక్షాళన చేస్తామన్నారు.
✦ ఆగస్టు 15 నాటికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నూతన ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. నాలుగు లక్షల గ్రామ వాలంటీర్లను నియమిస్తామని, ప్రభుత్వ పథకాలు నేరుగా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు చేరుస్తామని జగన్ చెప్పారు. ఒక్కో వాలంటీర్‌కు రూ.5 వేలు జీతం ఇస్తామన్నారు.
✦ ప్రస్తుతం అమలవుతోన్న పింఛన్లపై రూ.250 పెంచుతూ ఫైలుపై సీఎం జగన్ తొలి సంతకం చేశారు. ఇక్కడి నుంచి సంవత్సరానికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామని, తాము హామీ ఇచ్చిన ప్రకారం పింఛనును నాలుగేళ్లలో రూ.3000 చేస్తామని జగన్ పునరుద్ఘాటించారు. పెంచిన పింఛన్లు జూన్ 1 నుంచి అమలవుతాయన్నారు.
✦ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విధంగా వితంతువులు, వృద్ధులు పింఛన్లను పెంచుతూ నూతన సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.