YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బుగ్గన రాజేంద్రనాధ్ కు ఆమాత్య పదవి ఖాయమేనా

బుగ్గన రాజేంద్రనాధ్ కు ఆమాత్య పదవి ఖాయమేనా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   
 

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుకానున్న వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి మంత్రి పదవి దక్కనుంది. వైఎస్ జగన్‌కు మంచి మిత్రుడు, సన్నిహితుడిగా పేరున్న బుగ్గన కీలకమైన శాఖనే దక్కించుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. డోన్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బుగ్గన రెండవ సారి సుమారు 36 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీనికి తోడు టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై అన్ని రౌండ్లలోను ఆధిక్యత సాధించి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలోని బేతంచెర్ల పట్టణానికి చెందిన బుగ్గన మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా రెండు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికై పరిపాలనాదక్షుడిగా ప్రజల మన్ననలు పొందారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో బుగ్గన వైఎస్ జగన్ వెంట నడిచి ఆయనకు నమ్మకస్థుడిగా పేరొందారు. 2014 ఎన్నికల్లో జగన్ రాష్ట్రంలోనే తొలి టికెట్‌ను బుగ్గనకు ఏడాది ముందే కేటాయించారు. ఆ ఎన్నికల్లో బుగ్గన టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై సుమారు 12 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది నెలల్లోనే బుగ్గన తన వాక్ చాతుర్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రతిపక్ష పార్టీలో ఉంటూ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాబు ప్రభుత్వంపై జగన్ చేసే అన్ని పోరాటాల్లో సైతం బుగ్గన అండగా నిలిచి నమ్మినబంటుగా పేరొందారు. ఎంతో కీలకమైన పీఏసీ చైర్మన్ పదవిని సైతం దక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డోన్ నియోజకవర్గానికి బుగ్గన ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని చెప్పవచ్చురాష్ట్ర రాజకీయాల్లోనే డోన్ నియోజకవర్గానికి గత 4 దశాబ్దాలుగా ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయ బద్ద శత్రువులైన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబాల మధ్య మూడు దశాబ్దాలుగా రాజకీయ వైరం నెలకొంది. డోన్ అంటే కోట్ల, కేఈ కుటుంబాల మధ్యనే ప్రధానంగా రాజకీయ పోరు జరిగేది. అయితే గత ఐదేళ్లుగా ఆ రెండు కుటుంబాలు రాజకీయంగా ప్రాధాన్యతను కోల్పోతున్నాయనే సందేహం కలుగుతోంది. కేఈ కుటుంబానికి కంచుకోటగా వున్న డోన్‌లో బుగ్గన పాగా వేశారని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో బుగ్గన కేఈ ప్రతాప్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. అంతేగాక ఈసారి ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులైన కోట్ల, కేఈ కుటుంబాలు కలిసినా బుగ్గన విజయాన్ని అడ్డుకోలేకపోయారువైఎస్ జగన్ మంత్రి వర్గంలో డోన్ ఎమ్మెల్యే బుగ్గన కీలకమైన పదవి దక్కించుకునే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. డోన్ నుంచి రెండు సార్లు విజయం సాధించిన బుగ్గనకు పరిపాలన అనుభవం ఉండడంతో ఆర్థిక శాఖ లేక రెవెన్యూ శాఖ దక్కవచ్చని భావిస్తున్నారు. లేకపోతే ఏదో ఒక కీలకమైన శాఖ దక్కడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. డోన్‌కు మంత్రి పదవులు లేక రెండు దశాబ్దాలు కావస్తోంది. 1996లో రాజకీయాల్లో అడుగుపెట్టిన కేఈ ప్రభాకర్ తొలిసారిగా అటవీ శాఖ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1999లో మళ్లీ చంద్రబాబు అదికారంలోకి రావడంతో ఆ సమయంలో కేఈ ప్రభాకర్ చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా డోన్ నుంచి మంత్రి వర్గంలో పని చేశారు. ఆ తర్వాత 2004లో కోట్ల సుజాతమ్మ, 2009లో కేఈ కృష్ణమూర్తి, 2014లో బుగ్గన గెలుపొందారు. ఏదేమైనా రెండు దశాబ్దాల తర్వాత డోన్‌కు మళ్లీ కీలకమైన మంత్రి పదవి దక్కనుండడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేశారు

Related Posts