YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

ఢిల్లీ ఎయిమ్స్‌లో విద్యార్థి హత్య.. ఇన్సులిన్‌తోనే చంపేశారా?

ఢిల్లీ ఎయిమ్స్‌లో విద్యార్థి హత్య.. ఇన్సులిన్‌తోనే చంపేశారా?

 ఇన్సులిన్‌తోనే చంపేశారా?

ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యకళాశాల హాస్టల్‌లో మరో తమిళ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్య కళాశాలలో ఎండీ కోర్సు చేస్తున్న తిరుప్పూరు జిల్లా పారప్పాళయమంగళంకు చెందిన శరత్‌ ప్రభు (25) బుధవారం ఉదయం హాస్టల్‌ గదిలోని టాయ్‌లెట్‌లో శవమై పడి ఉండగా తోటి విద్యార్థులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆ కళాశాల నిర్వాహకులు శరత్‌ ప్రభు తండ్రికి రెండు రకాలుగా సమాచారం అందించారు. మంగళవారం రాత్రి శరత్‌ ప్రభు టాయ్‌లెట్‌లో జారి పడ్డాడని తెలిపి, బుధవారం ఉదయం అతడు మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో శరత్‌ ప్రభు మృతి పై తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడి మరణవార్త విని దిగ్ర్భాంతి చెందిన తండ్రి సెల్వమణి బుధవారం ఉదయం విమానంలో ఢిల్లీకి వెళ్లారు. కుమారుడి మృతదేహం చూసి సెల్వమణి బోరున విలపించాడు. శరత్‌ ప్రభుకు కన్నమ్మ అనే తల్లి, స్నేహ అనే చెల్లెలు ఉన్నారు. ఎండీ కోర్సు పూర్తి చేసి ఉన్నతస్థాయికి చేరుకుంటాడనుకున్న శరత్‌ ప్రభు ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబీకులు శోకతప్తులయ్యారు.

ఇన్సులిన్‌తో హత్య?

శరత్‌ప్రభు మృతదేహాన్ని పరీక్షించిన ఢిల్లీ వైద్యులు మధుమేహానికి ఉపయోగించే ఇన్సులిన్‌ను మోతాదుకు మించి వేసుకున్నందువల్లే మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. శరత్‌ ప్రభు తనకు తానుగా ఇన్సులిన్‌వేసుకుని ఉండడని గుర్తు తెలియని వ్యక్తులెవరో అతడికి ఇన్సులిన్‌ వేసి హత్య చేసి ఉంటారని అతడి స్నేహితులు చెబుతున్నారు.

 ఇన్సులిన్‌ను శరత్‌ ప్రభు నరాల్లో వేశారా లేక కండరాల్లో వేశారా అనే ప్రశ్నకు సమాధానం లభించడం లేదని పేర్కొంటున్నారు. శరత్‌ ప్రభు తండ్రి మాట్లాడుతూ తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, ప్లస్‌టూ పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందటం వల్లే మెడికల్‌ సీటు లభించిందన్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని ఎండీ చేసేందుకు ఏడు నెలలకు ముందే ఢిల్లీ వచ్చాడని చెప్పారు. ఢిల్లీ నుంచి రోజూ తనతో ఫోన్‌లో మాట్లాడేవాడని, ఎప్పుడూ విరక్తిగా మాట్లాడలేదన్నారు. మంగళవారం రాత్రి తన కుమారుడి స్నేహితుడు తనకు ఫోన్‌ చేసి శరత్‌ ప్రభు టాయ్‌లెట్‌లో జారిపడ్డాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపాడని చెప్పారు.

 బుధవారం ఉదయం మళ్లీ ఫోన్‌ చేసి శరత్‌ప్రభు మృతి చెందాడని, వెంటనే ఢిల్లీకి బయలుదేరి రమ్మని చెప్పాడన్నారు. తన కుమారుడు ఎలా మృతి చెందాడో ఎవరూ స్పష్టం చేయడం లేదని ఆయన బోరున విలపించారు. కాగా గత ఏడాది జులైలో తిరుప్పూరుకు చెందిన శరవణకుమార్‌ అనే విద్యార్థి కూడా ఇదే విధంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి మృతిపై పోలీసులు తీవ్ర విచారణ జరిపినా ఫలితం లేకపోయింది. ఇప్పటివరకూ శరవణకుమార్‌ ఎలా మరణించాడో ఢిల్లీ పోలీసులు కనుగొనలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా తిరుప్పూరు జిల్లాకు చెందిన మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం తీవ్ర సంచలనం సృష్టించింది.

Related Posts