యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైఎస్ జగన్ అధికారం చేపట్టారు. అంతా అనుకున్నట్లుగా మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయన్న చర్చ ఉత్తరాంధ్రలో సాగుతోంది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఇక్కడ ఉంటే అందులో 28 సీట్లను గెలుచుకుని వైసీపీ తిరుగులేని శక్తిగా మారింది. దాంతో ఈసారి ఉత్తరాంధ్ర నుంచి ఆశావహులు చాలా మంది ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే విశాఖ వరకూ కనీసం డజను మంది మంత్రి కావాలనుకుంటున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాస్, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, రాజాం ఎస్సీ కోటాలో కంబాల జోగులు, పాలకొండలో విశ్వసరాయి కళావతి పదవులో కోసం రేసులో ఉన్నారు.ఇక విజయనగరం తీసుకుటే బొబ్బిలి రాజులను ఓడించిన మాజీ
ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు, చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు నుంచి ఎస్టీ కోటాలో రాజన్నదొర, అలాగే కురుపాం నుంచి పుష్ప శ్రీవాణి మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఇక్కడ మొత్తానికి మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. దాంతో ఇద్దరిని మంత్రి పదవులు ఖాయంగా ఇస్తారని ప్రచారం సాగుతోంది.ఇక విశాఖ జిల్లాలో రేసులో అనేకమంది ఉన్నారు. మొదటగా చెప్పుకోవాల్సింది అవంతి శ్రీనివాస్. ఆయన భీమిలి నుంచి గెలిచారు. గాజువాక నుంచి పవన్ని ఓడించిన తిప్పల నాగిరెడ్డి సైతం తనకు మంత్రి పదవి వస్తుందని ఆశ పెట్టుకున్నారు. రూరల్ జిల్లాల్లో అనకాపల్లి నుంచి మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు కుమారుడు అమర్నాధ్ మంత్రి పదవి కోరుకుంటున్నారు. నర్శీపట్నం నుంచి సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రున్ని ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ మంత్రి పదవి తనకే అంటున్నారు. ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన సీనియర్ నేత కన్నబాబురాజు తన సామాజికవర్గం కోటాలో పదవి ఖాయమని భావిస్తున్నారు. ఇక చోడవరం నుంచి గెలిచిన కరణం ధర్మశ్రీ, పాయకరావుపేట నుంచి మూడవసారి విజేత అయిన గొల్లబాబూరావు, ఏజెన్సీలో గిడ్డి ఈశ్వరి మీద భారీ మెజారిటీతో నెగ్గిన కే భాగ్యలక్ష్మి కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ లిస్ట్ చూస్తే చాంతాడంత ఉంది. మరి జగన్ ఎవరిని అందలం ఎక్కిస్తారో, మరెవరిని బుజ్జగిస్తారో వేచి చూడాల్సిందే.