యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయనకు ఇప్పటి వరకూ ఎన్నికల్లో ఓటమి అనేది తెలియదు. అయితే తొలిసారి అయన ఓటమి పాలయ్యారు. గెలిచి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో కీలక పదవి దక్కేది. అయితే ఆ అవకాశాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేజేతులా చేజార్చుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వాస్తవానికి రాజకీయాలంటే విముఖతపుట్టింది. గతఎన్నికల్లోనూ ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. సతీమణి దగ్గుబాటి పురంద్రేశ్వరి రాజకీయాల్లో రాణిస్తుండటంతో ఆయన పోటీ ఆలోచన విరమించుకున్నారు.ఈసారి కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయాలని
భావించలేదు.కుమారుడు హితేష్ చెంచురామ్ చేత రాజకీయ అరంగేట్రం చేయించాలని భావించారు. దగ్గుబాటి పురంద్రీశ్వరి బీజేపీలో ముఖ్యమైన పదవిలో ఉండటం, ఆమె విశాఖపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేస్తుండటంతో ఆయన తాను పోటీ చేసేందుకు తొలుత సుముఖత వ్యక్తం చేయలేదు. ఆయన తన కుమారుడు హితేశ్ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. హితేష్ ను పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావించారు. అయితే హితేష్ కు అమెరికా పౌరసత్వం ఉండటం, చివరి నిమిషం వరకూ అది రద్దు కాకపోవడంతో జగన్ సూచన మేరకు ఆయనే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది. పర్చూరు నియోజకవర్గం దగ్గుబాటి కంచుకోట. ఇప్పటివరకూ నాలుగుసార్లు విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లోనూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పర్చూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. కానీ ఈసారిపర్చూరు నుంచి గెలిస్తే ఆయన వైసీపీ అధికారంలోకి వస్తే స్పీకర్ అవుతారన్న టాక్ బలంగా నడిచింది.వైసీపీ అధికారంలోకి వస్తే స్పీకర్ గా దగ్గుబాటిని జగన్ నియమిస్తారని సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. దగ్గుబాటి స్పీకర్ గా ఉంటే చంద్రబాబు సభలో ఉండలేరన్న విషయం కూడా వైరల్ అయింది. అయితే దగ్గుబాటి చివరకు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కేవలం 1503 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలిచారు. జగన్ వేవ్ లోనూ దగ్గుబాటి గెలవకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దగ్గుబాటి సక్రమంగా ప్రచారం చేయకపోవడం, డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్లనే ఓటమిపాలయ్యారని ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు బహిరంగంగా
చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో దగ్గుబాటి అంత దురదృష్టవంతుడు లేరన్నది మాత్రం చెప్పొచ్చు.