యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడ్డారు. ఈ మాట అంటుంది ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ నేతలే. ఏఐసీపీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సయితం కమల్ నాధ్ పట్ల పూర్తి అసంతృప్తితో ఉన్నారు. కమల్ నాధ్ సరిగా డీల్ చేయకపోయారని అగ్రనేతలు అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆనందాన్ని ఆరు నెలల పాటు కూడా నిలుపుకోలేకపోయారని అగ్రనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి అనేక కారణాలున్నాయంటున్నారు.మధ్యప్రదేశ్ లో మొత్తం 29 స్థానాలుండగా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 28 స్థానాల్లో విజయం సాధించింది.కమల్ నాధ్ కుమారుడు ఒక్కరే ఇక్కడ గెలుపొందడం విశేషం. జ్యోతిరాదిత్య సింధియా గుణ నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. అయితే ఇక్కడ ఒకరిని ఒకరు ఓడించుకున్నారని, బీజేపీ ప్రభావం కొంతఉన్నా కాంగ్రెస్ అగ్రనేతల తప్పిదాలే ఘోర ఓటమికి కారణాలుగా కొందరు బహిరంగంగా చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ఇంత దారుణ ఫలితాలు రావడం ఇదే ప్రధమమని గుర్తు చేస్తున్నారు.మధ్యప్రదేశ్ లో ఆరునెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చచ్చీ చెడీ గెలిచింది. ఇతరుల మద్దుతుతో అధికారంలోకి రాగలిగింది. అయితే ఇక్కడ రుణమాఫీ హామీని సక్రమంగా అమలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని
చెబుతున్నారు. ఇక ఆరు నెలల పాలనతో కమల్ నాధ్ ఒరగబెట్టిందేమీ లేదంటున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ హయాంలోనే బాగా అభివృద్ధి జరిగిందన్న అంచనాకు ప్రజలు వచ్చేశారు.దీనికితోడు కమల్ నాధ్ అభ్యర్థుల ఎంపికలోనూ సక్రమంగా వ్యవహరించలేదన్న ఆరోపణలున్నాయి.దీనికితోడు ఇక్కడ మూడు గ్రూపులు తయారయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాను కమల్ నాధ్ పక్కన పెట్టారు. దీంతో ఆయన వర్గం ఈ ఎన్నికల్లో సహకరించలేదంటున్నారు. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా మరో గ్రూపు తయారు చేసుకుని తనదైన శైలిలో పార్టీని డ్యామేజీ చేసేశారు. సీనియర్ నేతలు కేవలం కుర్చీలను అంటిపెట్టుకోవడం కోసం పార్టీని పణంగా పెట్టారని రాహుల్ భావిస్తున్నారు. దీనికితోడు ఇప్పడు కమల్ నాధ్ సర్కార్ క్రైసిస్ లో పడింది. ఇక్కడ భారతీయ జనతాపార్టీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మొత్తం మీద కమల్ నాధ్ ముఖ్యమంత్రిగా,పార్టీ నేతగా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది