యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఐదేళ్లుగా అడుగు పడని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఐదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను అనేకం ఉన్నాయి. అయితే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావులకు మధ్య గ్యాప్ రావడంతో సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి. గవర్నర్ నరసింహన్ ఎన్నిసార్లు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక అంశాలపై నెలకొన్న పీటముడి వీడిపోతుందన్న భావన వ్యక్తమవుతో్ంది.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రెండు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని, ఏపీకి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే కేసీఆర్ వద్దకు స్వయంగా వెళ్లి కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. తనకు కావాల్సిన ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను తెలంగాణ నుంచి ఏపీకి రప్పించుకోవడానికి కేసీఆర్ నుంచి అనుమతిని సులువుగానే పొందగలిగారు.విభజన బిల్లులో పెట్టిన అనేక అంశాలకు ఇంకా పరిష్కారం దొరకలేదు. ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా ఉద్యోగుల విభజన పూర్తికాలేదు. ఇప్పటికే ఏపీ ఉద్యోగులు తెలంగాణలో,తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.ఇక ఉమ్మడి ఆస్తుల పంపకం కూడా పూర్తికాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి వెళ్లి ఏళ్లు గడుస్తున్నప్పటికీ నేటికీ హైదరాబాద్ లో ఉన్న సచివాలయం, అసెంబ్లీ వంటి భవనాలను టీ సర్కార్ కు అప్పగించలేదు. దీనిపై పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ సఫలం కాలేదు.కృష్ణా జలాల పంపకంలో నేటికీ వివాదాలు నడుస్తున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టుతో ఏపీలో విలీనం అయిన ఏడు మండలాల్లోని ఐదు గ్రామ పంచాయతీల విషయం కూడా ఒక కొలిక్కిరాలేదు. కన్నయ్య గూడెం,ఏటిపాక, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, గుండాల గ్రామాలు ఏపీలోకి వెళ్లినా
తెలంగాణ భూభాగం మధ్యలో అవి ఉండిపోయాయి. దీంతో కేసీఆర్, జగన్ కూర్చుని దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రత్యేక హోదాకు సహకరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో జగన్, కేసీఆర్ ల మధ్య కుదిరిన స్నేహం రెండు తెలుగురాష్ట్రాల మధ్య ఏళ్లుగా నెలకొన్నసమస్యలకు పరిష్కారం దొరకుతుందన్న ఆశకలుగుతోంది. మరి చూడాలి ఎంతవరకూ సాధ్యమవుతుందో…?