యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఇక పాలనపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే గత వారం రోజుల నుంచి అన్ని శాఖలపై అధ్యయనం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతో సంక్షేమ పథకాలతో పాటు, తాను మ్యానిఫేస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాల్సి ఉంది. ప్రమాణస్వీకారం రోజునే పింఛను మొత్తాన్ని పెంచేశారు. ఇది కూడా ఏపీ ఖజానాపై భారం పడనుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన నవ్యాంద్రప్రదేశ్ కు కేంద్రం సాయం అవసరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.జగన్ కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకునే పనిలో ఉన్నారు. రాష్ట్ర హక్కుల కోసం ఒకవైపు పోరాడుతూనే మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో జాప్యం జరగకుండా
చూడాలన్నది జగన్ ఆలోచన. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 స్థానాలు దక్కాయి. 22 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. ఇంత పెద్ద యెత్తన పార్లమెంటు సీట్లు ఉన్నా కేంద్రంలో బలమైన మోదీ ప్రభుత్వాన్ని నిధుల కోసం, హక్కుల కోసం బతిమాలుకోక తప్పదు. అందుకే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసేందుకు నమ్మకమైన నేత కావాలంటున్నారు.జగన్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న సమయంలోనే పార్లమెంటరీ పక్ష నేతగా ఎవరినీ ఎన్నుకోలేదు. ఆ ఎంపిక బాధ్యతను పార్లమెంటు సభ్యులు జగన్ కే వదిలి పెట్టారు. ప్రమాణస్వీకారం పూర్తికావడంతో ఇక పార్లమెంటరీ నేత ఎంపికను జగన్ పూర్తి చేస్తారంటున్నారు.ఇప్పటికే హస్తినలో పనులు చక్కబెట్టడానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎటూ ఉండనే ఉన్నారు. ఆయనతో పాటు అందరినీకలుపుకుని పోతూ, కేంద్రం నుంచి సహకారాన్ని తక్షణం సాధించే నేత కోసం జగన్ వెతుకులాట ప్రారంభించారు.పార్లమెంటరీ నేతగా తొలుత మిధున్ రెడ్డి పేరు విన్పించింది. ఆయనపై జగన్ కు గురి ఉంది. అసంతృప్తిగా ఉన్న నేతలను ఏకతాటిపైకి తెచ్చి మిదున్ రెడ్డి రాయలసీమలో పార్టీ స్వీప్ చేయగలగేలా కృషి చేశారు. మిధున్ రెడ్డి రెండో సారి గెలవడంతో ఆయనకే ఛాన్స్ ఉంటుందని
చెబుతున్నారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా మిధున్ రెడ్డికి అవకాశం ఉండకపోవచ్చంటున్నారు. కాపు సామాజికవర్గానికిచెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని ఎంపిక చేస్తారన్న టాక్ కూడా పార్టీ నుంచి విన్పిస్తుంది. రెండు, మూడు రోజుల్లో పార్లమెంటరీ పార్టీనేత ఎంపికను జగన్ పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.