యూరేసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. కజకిస్తాన్‌లోని అల్మటీలో రెండు రోజుల పాటు జరిగిన ఈ అండర్–20 చాంపియన్‌షిప్‌లో 4 స్వర్ణాలు, 3 రజత పతకాలను సాధించారు. గురువారం జరిగిన బాలుర 800 మీటర్ల పరుగులో శ్రీకిరణ్ లక్ష్యాన్ని 1 నిమిషం 54.62 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో రోహిత్ యాదవ్ ఈటెను 74.55 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని అందుకున్నాడు.4/400 మీటర్లమిక్స్‌డ్ రిలేలో అబ్దుల్ రజాక్, ప్రిసిల్లా డేనియల్, ఫ్లోరెన్స్ బర్లా, విక్రాంత్ పాంచల్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 30.58 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచింది. బాలుర 400 మీటర్లలో అబ్దుల్ రజాక్, బాలికల 800 మీటర్ల పరుగులో ప్రిసిల్లా డేనియల్, బాలుర జావెలిన్ త్రోలో సాహిల్ సిల్వాల్ రజత పతకాలను సాధించారు. పోటీల తొలిరోజు బుధవారం గుర్వీందర్ సింగ్ (100 మీటర్లు), విక్రాంత్ పాంచల్ (400 మీటర్లు), ఫ్లోరెన్స్ బర్లా (400 మీటర్లు) స్వర్ణాలను అందించారు.