YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

నలుగురు ఉన్నతాధికారులకు కిమ్ మరణశిక్ష

నలుగురు ఉన్నతాధికారులకు కిమ్ మరణశిక్ష

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో 
 

అమెరికాలోని తమ దేశ ప్రత్యేక రాయబారి కిమ్‌ హయెక్‌ చోల్‌కు ఉత్తర కొరియా మరణశిక్ష అమలు చేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను మోసం చేశారన్న ఆరోపణలతో ఆయనకు మరణశిక్ష అమలు చేసినట్టు దక్షిణ కొరియా న్యూస్‌పేపర్‌ ‘ది చోసన్‌ ఎల్బో’ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య వియత్నాం రాజధాని హనోయ్‌లో జరిగిన రెండురోజుల శిఖరాగ్ర సదస్సులో హయెక్‌ చోల్‌ కీలకంగా వ్యవహరించారు. కిమ్‌తో పాటు ఆయన ప్రైవేటు రైలులో ప్రయాణించి హనోయ్‌ చేరుకున్నారు. ‘మార్చిలో మిరిమ్‌ విమానాశ్రయంలో కిమ్‌ హయెక్‌ చోల్‌కు ఫైరింగ్‌ స్క్వాడ్‌ మరణశిక్ష అమలు చేశారు. ఆయనతో నలుగురు విదేశాంగ అధికారులకు కూడా ఇదే శిక్ష విధించార’ని గుర్తు తెలియని వర్గాలు వెల్లడించినట్టు ‘ది చోసన్‌ ఎల్బో’ తెలిపింది. మరణశిక్షకు గురైన నలుగురు అధికారుల పేరు వెల్లడికాలేదు.ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఉత్తర కొరియా ఆంతరంగిక వ్యవహారాల శాఖ నిరాకరించింది. ట్రంప్‌తో జరిగిన శిఖరాగ్ర సదస్సులో తప్పు చేశారన్న ఆరోపణలతో కిమ్‌కు దుబాసి(ట్రాన్స్‌లేటర్‌)గా వ్యవహరించిన షిన్‌ హయి యంగ్‌ను కూడా జైలుకు పంపినట్టు దక్షిణ కొరియా న్యూస్‌పేపర్‌ తెలిపింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్‌కు కిమ్‌ చేసిన కొత్త ప్రతిపాదనను అనువదించడంలో షిన్‌ హయి విఫలమయ్యారని ఆమెపై అభియోగాలు నమోదు చేసినట్టు వెల్లడించింది.కాగా, హనోయ్‌లో కిమ్‌, ట్రంప్‌ మధ్య ఫిబ్రవరిలో జరిగిన రెండురోజుల శిఖరాగ్ర సదస్సు ఒప్పందాలేమీ లేకుండానే ముగిసింది. హనోయ్‌ శిఖరాగ్ర సమావేశం విఫలం కావడానికి అమెరికా, కొరియా అప్పట్లో వేర్వేరు కారణాలు చెప్పాయి. యాంగ్‌బియాన్‌ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని, అందుకు ప్రతిఫలంగా తమపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తేయాలని కిమ్‌ కోరినట్టు అమెరికా తెలిపింది. అక్కడున్న రెండో అణుకేంద్రాన్ని సైతం ధ్వంసం చేస్తేనే ఆంక్షలు సంపూర్ణంగా ఎత్తేస్తామని తాము చెప్పడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని వెల్లడించింది. అమెరికా అమలు చేస్తున్న 11 ఆంక్షల్లో అత్యంత కీలకమైన అయిదింటిని మాత్రమే రద్దు చేయమని అడిగామని ఉత్తర కొరియా తెలిపింది.

Related Posts