యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చల్లా రామకృష్ణారెడ్డి…రాయలసీమలో పేరున్న నేత. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఆయన హాట్ టాపిక్ గా మారారు. చల్లా రామకృష్ణారెడ్డి కోరిక నెరవేరుతుందా? ఆయన చట్ట సభల్లో అడుగుపెడతారా? అది ఎప్పుడు? అనేచర్చ జరుగుతోంది. చల్లా రామకృష్ణా రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరిన చల్లా తాను అనుకున్నది సాధించారు. బనగానపల్లి నియోజకవర్గంలో వైసీపీ విజయానికి కృషి చేశారు.గతకొద్ది సంవత్సరాలుగా ఆయన రాజకీయపదవులకు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికలలో చల్లా రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో ఆయనకు ఎమ్మల్సీ పదవి ఇస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇవ్వడంతో అప్పట్లో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి విజయానికి కృషి చేశారు. గెలుపొందారు. అయితేచంద్రబాబు నాయుడు ఐదేళ్లలో ఆయనకు ఎన్నిసార్లు అవకాశం వచ్చినా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఆయనకు తొలుత ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. దానిని కాదనడంతో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు.దీనితో సంతృప్తి చెందనిచల్లా రామకృష్ణారెడ్డి టీడీపీని వీడి ఫ్యాన్ కిందకు ఎన్నికలకు ముందు వచ్చేశారు.బనగానపల్లెలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విజయానికి మనస్ఫూర్తిగా పని చేశారు. కాటసాని రామిరెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డిపై దాదాపు పథ్నాలుగు వేల మెజారిటీతో గెలిపించారు. ఈ నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డికి రెండు తక్కువగా లక్ష ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డికి 86,614 ఓట్లు వచ్చాయి. ఇలా కాటసాని గెలుపునకు చల్లా రామకృష్ణారెడ్డి ప్రత్యక్షంగా తోడ్పడ్డారు. తెలుగుదేశం పార్టీ కంచుకోటలైన ప్రాంతాల్లోనూ ఫ్యాన్ పార్టీ గాలి బలంగా వీచింది. దీనికి చల్లా రామకృష్ణారెడ్డి బలం తోడవ్వడంతో కాటసాని గెలుపు సులువయింది.చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరే ముందు వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. తన కుమారుడ చల్లా భగీరధరెడ్డి భవిష్యత్తు కోసమే తాను పార్టీలో చేరుతున్నానని జగన్ ఎదుట చల్లా కుండ బద్దలు కొట్టినట్లు తెలిసింది. అయితే భగీరధ్ రెడ్డి భవిష్యత్తును తనకు వదిలేయమని జగన్ చెప్పారట. అలాగే చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా జగన్ ప్రామిస్ చేశారట. చాలా రోజుల నుంచి చల్లా చట్ట సభల్లో అడుగుపెడదామని భావిస్తున్నారు. అయితే తనకు పట్టున్న బనగానపల్లిలో టిక్కెట్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఎమ్మెల్సీ పదవిని చల్లా ఆశిస్తున్నారు. జగన్ మాట ఇచ్చారు కాబట్టి త్వరలోనే చల్లాకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.