యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆదిమూలపు సురేష్.. జగన్ టీంలో ఇప్పుడు నానుతున్న పేరు. గత ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆదిమూలపు సురేష్ ఈసారి ఎర్రగొండపాలెం నుంచి బరిలోకి దిగి నెగ్గారు. దళితుడైన ఆదిమూలపు సురేష్ పార్టీ కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఘన విజయం సాధించిన వెంటనే జగన్ శాసనసభ పక్షనేతగా ప్రతిపాదించిన వారిలో ఆదిమూలపు సురేష్ ఒకరు. గవర్నర్ వద్దకు కూడా జగన్ సురేష్ ను వెంట పెట్టుకుని వెళ్లారు. ఆయనకు జగన్ ప్రత్యేక గౌరవం ఇచ్చారు.ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ కు జగన్ కేబినెట్ లో ఖచ్చితమైన స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. ఆదిమూలపు సురేష్ 2009లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తర్వాత జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంతో ఆయన ఆపార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికలలో జగన్ సురేష్ కు సంతనూతలపాడు నియోజకవర్గం టిక్కెట్ ను కేటాయించారు. అక్కడినుంచి విజయం సాధించిన సురేష్ తెలుగుదేశం పార్టీ విసిరిన ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగలేదు.దీంతో జగన్ పార్టీ అధికార ప్రతినిధిగా జగన్ ఆయన్ను నియమించారు. ఎర్రగొండ పాలెం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన పాలపర్తి డేవిడ్ రాజు పార్టీ వీడి వెళ్లిపోయారు. దీంతో జగన్ సురేష్ ను సంతనూతలపాడునుంచి ఎర్రగొండపాలెంకు షిప్ట్ చేశారు. ఇక్కడ తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్ధి అజితారావు పై దాదాపు 31 వేల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆదిమూలపు సురేష్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లయింది. ప్రకాశంజిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత సీనియర్ నేతగా సురేష్ ఉన్నారు.ఎన్నికల ప్రచారం సమయంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవిని ఖాయం చేశారు జగన్. ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మానుగుంట మహీధర్ రెడ్డి కూడా సీనియర్. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. అయితే ఒకే సామాజిక వర్గానికి జిల్లాలో ఇచ్చే అవకాశం లేకపోవడంతో మానుగుంటకు కేబినెట్ లో చోటు డౌటే. ఎస్సీ కోటాలో ఆదిమూలపు సురేష్ కు మంత్రి పదవి ఖాయమని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా కావడం, ఎస్సీ సామాజిక వర్గం కావడంతో ఆయనకు ఛాన్స్ ఎక్కువ అని పార్టీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.