యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శిల్పా చక్రపాణిరెడ్డి… దాదాపు ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఆయన పదవిని సోదరుడి కోసం తృణప్రాయంగా వదిలేసుకున్నారు. తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికి శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై అప్పటికి మూడు నెలలు కూడా కాలేదు. అయితే శిల్పా చక్రపాణిరెడ్డి సోదరుడి వెంట నడవాలనుకుని పార్టీకి రాజీనామా చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి రావాలని కోరడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు.ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డిని జగన్ సముచితంగా గౌరవించారు. ఆయన చేసిన త్యాగాన్నిగుర్తించారు. శ్రీశైలం నియోజకవర్గం టిక్కెట్ ను శిల్పా చక్రపాణిరెడ్డికి కేటాయించారు. శిల్పా కుటుంబానికి రెండు టిక్కెట్లుజగన్ కేటాయించడం విశేషం. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్రారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి దాదాపు నలభై వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందడం విశేషం.శిల్పా చక్రపాణిరెడ్డి ఇప్పుడు జిల్లాలోనే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నందుకు ఇప్పుడు జగన్ క్యాబినెట్ లో చోటు దక్కుతుందన్నప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ, భూమా ఫ్యామిలీలు టీడీపీలో ఉండి దారుణంగా ఓటమిని చవిచూశాయి. శిల్పా కుటుంబం మాత్రం ఈ ఎన్నికలలో విజయం సాధించింది. పట్టున్న కేఈ కుటుంబాన్ని తట్టుకోవాలంటే మంత్రివర్గంలో శిల్పా కుటుంబానికి చోటు ఇవ్వక తప్పని పరిస్థితి జగన్ ది. చక్రపాణిరెడ్డి సీనియారిటీ కూడా ఇందుకు ఉపయోగపడుతుందంటున్నారు.సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి ఉన్నవారినే జగన్ పార్టీలో చేర్చుకుంటారనడానికి చక్రపాణిరెడ్డి ఉదంతమే ఉదాహరణ. 2014 ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన భూమాకుటుంబం మంత్రి పదవి కోసం పార్టీని వీడటం ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. వారు మంత్రి పదవి కోసం పార్టీని వీడతే… ఉన్న ఎమ్మెల్సీ పదవిని వదలి పార్టీలో చేరడంతోనే శిల్పా చక్రపాణిరెడ్డికి జగన్ క్యాబినెట్ లో చోటు కల్పిస్తున్నారన్న టాక్ విన్పిస్తుంది. మొత్తం మీద శిల్పా చేసిన త్యాగానికి ప్రతిఫలం జగన్ ఇవ్వబోతున్నారన్నది కర్నూలు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.