యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని ఘనంగా చెప్పుకొన్నప్పటికీ.. ప్రజలు ఈ పార్టీని ఆదరించలేదు. కేవలం 23 మంది మాత్రమే టీడీపీ నాయకులు విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో వైసీపీ దూసుకుపోయింది. ముఖ్యంగా 2014లో కొన్ని జిల్లాలను క్లీన్ స్వీప్ చేసేసిన టీడీపీకి ఇప్పుడు చుక్కలు కనిపించాయి. పశ్చిమలో గత ఎన్నికల్లో ఒక్క సీటునుకూడా దక్కించుకోని వైసీపీ ఇప్పుడు భారీ సంఖ్యలో సీట్లను కొల్లగొట్టింది. అయితే, దీనికి ప్రధాన కారణం.. జనసేనేనని తెలుస్తోంది.ఆయా జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకును పూర్తిస్థాయిలో జనసేన కొల్లగొట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. జనసేన ఎఫెక్ట్ ఇప్పుడు, గతంలో 2009లోనూ ప్రజారాజ్యం ఎఫెక్ట్ కారణంగా టీడీపీ తన హవాను కోల్పోయింది. దాదాపు ఐదారు అసెంబ్లీ సీట్లలో టీడీపీ మూడో ప్లేస్‌కు పడిపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కీలకమైన తాడేపల్లిగూడెం, ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ థర్డ్ ప్లేస్‌కు పడిపోయింది. ఇక, తాజా ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితిని టీడీపీ చవి చూసింది. వాస్తవానికి జనసేన ఎఫెక్ట్పై చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమైనా ఉంటే.. అది వైసీపీకి పడకుండా.. జనసేనకు పడుతుందని తద్వారా తాను గట్టెక్కేయొచ్చని చంద్రబాబు భావించారు.అయితే, అనూహ్యంగా పరిస్థితి మారిపోయింది. కాపులు సహా పలు సామాజిక వర్గాలు జనసేనకే ఓట్లు వేసినట్టు స్పష్టమవుతోంది. భీమవరం, నరసాపురం లాంటి నియోజకవర్గాల్లో మూడో స్థానానికి టీడీపీ చేరిపోయింది. నరసాపురం ఎంపీ సీటును 26 వేల తేడాతో ఓడిపోయింది. తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ కేవలం 1000 ఓట్లతో పరాజయం పాలయ్యారు. దీనివెనుక జనసేనకు ఓట్లు చీలిపోవడం, ఆ పార్టీ ఎఫెక్ట్ బలంగా కనిపించింది. తాడేపల్లిగూడెంలో జనసేనకు 35 వేల ఓట్లు వస్తే.. 16 వేల తేడాతో టీడీపీ సీటు కోల్పోయింది. ఇక, నరసాపురం, భీమవరంలో జనసేన సెకండ్ ప్లేస్‌కి వచ్చి.. టీడీపీ థర్డ్ ప్లేస్‌కు పడిపోయింది. ఇదంతా కూడా జనసేన ఎఫెక్టేనని అంటున్నారు పరిశీలకులు. అందువల్లే నరసాపురం ఎంపీ సీటును టీడీపీ స్వల్ప తేడాతో కోల్పోయింది.ఇక, అత్యంత కీలకమైన నియోజకవర్గం ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. ఇది జనసేన ఎఫెక్టేనని అంటున్నారు. అదేవిధంగా ఏలూరులోనూ జనసేన నుంచి టీడీపీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఇక్కడ జనసేన ఎఫెక్ట్‌తో టీడీపీ కేవలం 3 వేల ఓట్ల తేడాతో సీటు కోల్పోయింది. నిడదవోలులోనూ ఇదే తరహా ఎదురు దెబ్బ తగిలింది. ఇలా కాపులు సహా వివిధ సామాజిక వర్గాలు ఉన్న చోట జనసేన దెబ్బకు టీడీపీ ఫుల్లుగా బుక్కయింది. అయితే, ఇది ఇప్పటితో పోతుందా? అంటే కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని గట్టెక్కిన టీడీపీ ఇప్పుడు మాత్రం జనసేన దెబ్బకు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని అంటున్నారు.