యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇప్పుడు అందరి దృష్టి… జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయబోయే కేబినెట్‌పై ఉంది. ఫలితాలకు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారం రోజులు గడువు ఉన్నప్పటికీ… జగన్.. సహచరులను ఎంపిక చేసుకోవడంపై కసరత్తు చేయలేకపోయారు. మరో వారం రోజుల్లో.. ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. మంత్రివర్గం సమతూకంతో ఉండాలి. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఉండాలి. లేకపోతే… ప్రజల్లో వ్యతిరేక భావనలు వస్తాయి. ఇది ఓ రకంగా… జగన్మోహన్ రెడ్డికి సవాల్ లాంటిది. ఎందుకంటే… సామాజికపరంగా చూసుకుంటే.. రెడ్డి సామాజికవర్గం వారే.. 52 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు… రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. రిజర్వుడు కేటగరి కాకుండా…కడప, పెనుగొండ నుంచి మాత్రమే… ఇతర సామాజికవర్గాల ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే.. రాయలసీమ నుంచి… వేరే సామాజికవర్గాలకు చాన్సివ్వాలంటే.. వీరిద్దరిలో ఎవరికైనా ఇవ్వాలి. కానీ గెలిచిన వారిలో మంత్రి పదవికి అర్హులైన వారు చాలా మంది ఉన్నారు. ఇక మిగతా చోట్ల… కీలకమైన సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. పార్టీ పెట్టినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డితో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరికొంత మంది ఓడిపోయారు. గెలిచిన వాళ్లలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పిల్లి సుభాష్ సహా చాలా మంది ఉన్నారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఓటమిపాలైనా ఆయన ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆ తర్వాత పార్టీలో చేరిన వారిలో.. ధర్మాన, బొత్స, ఆనం సహా.. అనేక మంది సీనియర్లు ఉన్నారు. వీరందరికీ.. జగన్ న్యాయం చేయాల్సి ఉంది. మొత్తం తనతో ఉన్న వారిలో పన్నెండు మందిని జగన్ గుర్తించారని.. వారిలో నలుగురికి పదవులివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచార సభల్లోనే.. వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరికి మంత్రి పదవులు ఇస్తాననేదానిపై జగన్ ప్రకటనలు చేశారు. గెలిపించండి.. మంత్రిని చేస్తానని.. అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. చిలకలూరిపేట టికెట్‌ను విడదల రజనికి త్యాగం చేసినందుకు…మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మాట నిలబెట్టుకుంటారన్న పేరు నిలబడటానికయినా… వీరిని మంత్రుల్ని చేయాల్సి ఉంది. మొత్తంగా కేబినెట్‌లో ఇరవై ఐదు మందికి మాత్రమే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి.. అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ.. కేబినెట్‌ను ఏర్పాటు చేయడానికి … ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉంది.