యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
ఏపీలో అధికారం మారింది. పదేళ్ళుగా పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వైసీపీ నేతలకు ఇపుడు రెక్కలు వచ్చాయి. కాబోయే మంత్రులం తామేనని ధీమాగా ఉన్నారు. తమ ప్రభుత్వం వచ్చింది కాబట్టి టీదీపీ నేతల ఆటలు కట్టిస్తామని, అక్రమాలు బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. విశాఖలో రెండేళ్ళ క్రితం జరిగిన భూ కుంభకోణం ఏపీవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి విధితమే. ఈ భూ కుంభకోణంలో పెద్ద తలకాయలు ఉన్నాయని సాక్షాత్తు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పడంతో మరింత వేడెక్కింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు, అనేక మంది ఎమ్మెల్యేల హస్తం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. మరి దీని మీద స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం (సిట్) విచారణకు ఆదేశించి చేతులు దులుపుకుంది. సీబీఐ విచారణ విపక్షాలు కోరినా కూడా అప్పటి బాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. తీరా సిట్ నివేదిక సైతం బయటపెట్టకుండా క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇపుడు విశాఖ రాజకీయాల్లో అదే అగ్గి రాజేస్తోంది.విశాఖ నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు సిట్ విచారణను మళ్ళీ చేపడతామని చెబుతున్నారు. ఇందులో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని అంటున్నారు. దీని మీద అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతు తమ ప్రభుత్వం తప్పకుండా సిట్ ని మళ్ళీ వేసి కబ్జాదారులెవరో బయటపెడుతుందని, పేదల, ప్రభుత్వ భూములు కభా చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వంటి వారు భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నారని కూడా ఆయన గుర్తుచేశారు. ఇదే విషయమై వైసీపీకి చెందిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారయణ కూడా మాట్లాడుతున్నారు. సిట్ విచారణ తమ ప్రభుత్వం కోరుతుందని చెప్పారు. విశాఖ భూములను కాపాడుతామని, అవినీతిపరులకు శిక్షలు తప్పవని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉండగా విశాఖలో విలువైన భూములు అప్పట్లో కబ్జాకు గురి అయ్యాని ఆరోపణలు వెల్లువెత్తాయి. పెందుర్తి నుంచి భీమునిపట్నం వరకూ ఉన్న పేదల భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములకు రెక్కలు వచ్చాయని కూడా నాడు ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. వీటి విలువ అచ్చంగా వేల కోట్లలో ఉంటుందని కూడా అంచనా వేశారు. ఇందులో టీడీపీలో ఉన్న పెద్దలంతా ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. మరి సిట్ కనుక రీ ఓపెన్ చేస్తే ఇపుడు వారంతా నిజంగా బయటకు వస్తారా, ప్రభుత్వ భూములకు న్యాయం జరుగుతుందా, పేదలకు ఆ భూములు దక్కుతాయా, నిజంగా ఇందులో దోషులకు శిక్ష పడుతుందా అన్నది చర్చగా ఉంది. కేవలం కొత్తగా అధికారం వచ్చిందన్న ఉత్సాహంతో చేస్తున్న ప్రకటనలు అయితే మాత్రం రెండు పార్టీలకు ఎటువంటి తేడా ఉండదని కూడా జనం అనుకుంటున్నారు.