యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లగ్జరీ లైఫ్, ఓదార్పు యాత్ర, జైలు జీవితం, పాదయాత్ర, ఏపీ ముఖ్యమంత్రి... ఇది సింపుల్ గా చెప్పాలంటే జగన్ బయో. ఎట్టకేలకు వైఎస్ కుటుంబానికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ప్రజలపై అసమాన ముద్ర వేసిన వైఎస్ అడుగు జాడల్లో నడిచి ప్రజలను మెప్పించి ఎట్టకేలకు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినా జగన్ సమ్ థింగ్ స్పెషల్. దీనికి అతని ప్రయాణం ఓ కారణం. మరో వైపు ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రిగా అవడం తెలుగు రాష్ట్రాల్లో ఇది తొలిసారి.
ఇదంతా పక్కన పెడితే... జగన్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఏపీలో ఓ కొత్త రికార్డు నమోదైంది. తెలుగురాష్ట్రాల్లో ఇద్దరు మహిళలు అరుదైన రికార్డు సృష్టించారు. ఆ ఇద్దరికి దక్కిన ఆ అవకాశం ఎవరికీ దక్కలేదు. వారిలో ఒకరు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయితే, మరొకరు వైఎస్ సతీమణి విజయమ్మ. ఈరోజు విజయమ్మ కుమారుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఉద్వేగం, తన్మయత్వం, సంతోషం ఆమెలో అణవణువూ కనిపించింది. వేదిక మీద జగన్ ను ఆప్యాయంగా హత్తుకుని నుదుట ముద్దుపెట్టారు విజయమ్మ. ఇది ఈరోజు జరిగిన ఘటన. ఇక ఆమెకు దక్కిన రికార్డు ఏంటంటే... కొడుకును, భర్తను ఇద్దరినీ ముఖ్యమంత్రిగా చూడగలిగింది. ఈ అవకాశం బహుశా దక్షిణ భారతదేశంలోనే ఎవరికీ దక్కలేదు. ఇక భువనేశ్వరి విషయానికి వస్తే... తండ్రిని, భర్తను ఆమె ముఖ్యమంత్రిగా చూసింది. విజయమ్మతో పోల్చినపుడు ఈమె రికార్డు కొంచెం భిన్నం. కాకపోతే తండ్రిని మూడు సార్లు, భర్తను మూడుసార్లు ముఖ్యమంత్రిగా చూసిన ఏకైక మహిళ దేశంలోనే రికార్డు సృష్టించారు భువనేశ్వరి. మొత్తానికి ఈ విధంగా వీరిద్దరు తెలుగు రాష్ట్రాల్లో లక్కీ లేడీస్ అయ్యారు