ఇదేమీ కొత్త వ్యవహారం కాదు. గతం నుంచి కొనసాగుతూ ఉన్నదే. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల పేర్లు పెట్టారు. వైఎస్ స్వయంగా ప్రారంభించిన ఆరోగ్యశ్రీ వంటి పథకానికి రాజీవ్ పేరు పెట్టారు. భారీ ఎత్తున కేటాయించిన ఇళ్ల పథకానికి ఇందిరమ్మపేరు పెట్టారు.అలా రాజశేఖర రెడ్డి హయాంలో ప్రధానంగా ఇందిర రాజీవ్ ల పేర్లను సంక్షేమ పథకాలకు పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా ఆయన సొంత పేరును పథకాలకు పెట్టే ప్రయత్నం చేశారు. 'రాజవ్ యువ కిరణాలు'అంటూ కిరణ్ కుమార్ రెడ్డి తన పేరును కూడా కలిపే ప్రయత్నం చేశారు.ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టి మొత్తం పథకాల పేర్లను మార్చేసే ప్రయత్నం చేశారు. వైఎస్ మానస పుత్రిక ఆరోగ్య శ్రీకి కూడా చంద్రబాబు నాయుడు పేరు మార్చారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చారు చంద్రబాబు. అనేక పథకాలకు 'చంద్రన్న' ట్యాగ్ ను తగిలించారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ పథకాల పేర్లు మారుతూ ఉన్నాయి.ఇప్పటికే పెన్షన్ పథకానికి పేరు మార్చారు. 'వైఎస్ ఆర్ పెన్షన్' పేరుతో ఆ పథకాన్ని అమలు చేయనున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకానికి అక్షయ పాత్ర ట్రస్టుతో ఏపీ
ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటోంది. ఆ పథకానికి 'వైఎస్ ఆర్ అక్షయ పాత్ర' గా పేరును ఖరారు చేశారు.ఇవి మాత్రమే కాదు.. మరిన్ని పథకాలకు పేర్లు మారడం ఖాయంగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ ఆర్ పేరు పెట్టాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేతలు అప్పుడే డిమాండ్ మొదలుపెట్టారు. అది జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది.