యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ప్రజలు కట్టబెట్టిన అఖండ మెజారిటీతో తనపై బాధ్యత పెరిగిందని, సంవత్సరంలో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా పాలిస్తానని జగన్ చెబుతున్నారు. ముఖ్యంగా ఆయన అవినీతి రహిత పాలన గురించి తరచూ మాట్లాడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మొదలుకొని పలు జాతీయ ఛానళ్లు చేసిన ఇంటర్వ్యూలతో పాటు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి ప్రసంగంలోనూ జగన్ అవినీతి రహిత పాలన ఇస్తానని చెప్పారు. ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసి దిద్దుబాటు చేస్తానని బాహాటంగానే చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో అడ్డగొలుగా ఎక్సెస్ కు ఇచ్చిన టెండర్లను పునసమీక్షించి రివర్స్ టెండరింగ్ చేయిస్తానని, దీని ద్వారా ఎంత డబ్బు మిగిలిందో ప్రజలకు లెక్కలతో సహా చెబుతానని జగన్ చెబుతున్నారు.సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తవ్వి తీయడం కామన్. జగన్ ఈ పనిని ఏకంగా చెప్పి మరీ చేస్తున్నారు. పాలనపై ఆయన పట్టు పెంచుకుంటూనే మరోవైపు మొదటి ఆరు నెలల పాటు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన తప్పులపై జగన్ దృష్టి పెట్టానున్నారట. ఇప్పటికే ఆయన ఈ పనిని ప్రారంభించారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పలు ప్రాజెక్టుల అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందునుంచే ఆరోపణలు చేస్తోంది. కమీషన్ల కోసం అంచనాలు విపరీతంగా పెంచారని, కాంట్రాక్టులను తమ వారికే ఇప్పించుకున్నారనేది చంద్రబాబు, టీడీపీపై వైసీపీ ఆరోపణ. ఇప్పుడు తామే అధికారంలోకి రావడంతో ఇంతకాలం చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం నిన్న ఒక ఆర్డర్ జారీ చేసింది. కాంట్రాక్టు పొంది ఇంతవరకు పని ప్రారంభించని కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు 25 శాతం పనులు మాత్రమే పూర్తి చేసిన వాటిని మళ్లీ సమీక్షించాలనేది ఆ జీఓ సారాంశం. ఈ కాంట్రాక్టులకు బిల్లులు కూడా చెల్లించవద్దని ఆదేశాలు వచ్చాయి. దీంతో చంద్రబాబు హయాంలో కాంట్రాక్టులు దక్కించుకున్న వారికి తిప్పలు తప్పేలా లేవు. కచ్చితంగా ఈ కాంట్రాక్టుల్లో జరిగిని అవినీతిని వెలికితీయాలని జగన్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. తాము ఇలా వెలికితీసి కొత్త వారికి కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ఖజానాకు ఎంత మిగిల్చామో కూడా ప్రజల్లో లెక్కలు పెట్టనున్నారు. ఇది చంద్రబాబు నాయుడును, టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కేవలం కాంట్రాక్టులే కాకుండా రాజధాని భూముల వ్యవహారం, తర అంశాల్లో కూడా అవకతవకలు జరిగాయని, వాటిని వెలికితీయడం ఖాయమని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి ఆరు నెలల పాటు జగన్ ప్రభుత్వాన్ని నడిపించడంతో పాటు ఈ పని కూడా చేసేందుకు డబుల్ డ్యూటీ చేయనున్నట్లు కనిపిస్తోంది.