యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అయిదేళ్లు బిగిస్తే పిడికిలి… అయిదు అంశాలతో ఆంధ్రప్రదేశ్ పై పట్టు బిగించాలనుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. నూతన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన వైసీపీ అధినేత పక్కా ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు తొలి ప్రసంగంలోనే సంకేతాలిచ్చేశారు. తొలి సంతకంతోనే సెంటిమెంటును రంగరించారు. పైకి చూస్తే పరిపాలన, సంక్షేమానికి సంబంధించిన పథకాలుగా కనిపిస్తాయి. కానీ లోతుల్లోకి తొంగి చూస్తే రాజకీయంగా పకడ్బందీ ప్లాన్ తోనే జగన్ ముందడుగు వేయాలనుకుంటున్నట్లు తేటతెల్లమవుతుంది. సంక్షేమ పథకాల ద్వారా పేదలను సంతృప్తిపరచడం ఇప్పటికే అన్ని సర్కారులు అమలు చేస్తున్నాయి. దీనిని పార్టీకి ప్రయోజనకరంగా మార్చాలి. అదే సమయంలో నిరుద్యోగభృతి వంటి పథకాల వల్ల అధికారంలోని పార్టీకి, ప్రభుత్వానికి పెద్దగా కలిసొస్తున్నది లేదు. దీనికి ప్రత్యామ్నాయం రూపకల్పన చేయాలి. అది ద్విముఖంగా ఉపయోగపడాలి. ఇవే అంచనాలతో జగన్ మోహన్ రెడ్డి తన అయిదేళ్ల భవిష్య ప్రస్థానాన్ని ప్రకటించారు. ముఫ్ఫైఏళ్ల పాటు అధికారంలోనే కొనసాగాలనే తన స్వప్నానికి పదవీ స్వీకారంతోనే నాంది పలికారు.ప్రతి సభలోనూ, పాదయాత్రలోని ప్రతి ఘట్టంలోనూ జగన్ ప్రస్తావించిన అంశం అమలుకు తొలి సంతకం చేశారు. అవ్వకు, తాతకు సరిపడ పింఛన్ ఇవ్వాలంటూ తన డిమాండుగా వినిపించేవారు. తాను అధికారంలోకి వస్తే వారి పించన్ మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు పదవీ స్వీకారంలో తొలిసంతకంగా నెలవారీ పింఛన్ మొత్తం 2250కి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న మూడేళ్లలో ఏటా 250 చొప్పున పెంచుతానని హామీ ఇచ్చారు. ఇదొక సెంటిమెంటుగానే చూడాలి. పెద్దల ఆశీర్వాదం ఉంటే పాలన సాఫీగా సాగిపోతుందనే విశ్వాసం ఒక కారణమైతే పెద్దలు క్రుతజ్ణతగా ఓట్లు వేస్తారనే నమ్మకం మరో కారణం. ముఖ్యంగా కన్నబిడ్డలే పట్టించుకోని కాలంలో సర్కారు తరఫున చేస్తున్న సాయం ప్రభుత్వాధినేతలకు మంచి పేరు తెచ్చిపెడుతోంది. ఈ నాడిని జగన్ సరిగ్గానే పట్టుకోగలిగారు. తన పాదయాత్రలో ప్రతిచోటా ఈ అంశాన్ని ప్రముఖంగానే చర్చకు తెచ్చారు. పేద వ్రుద్దులకు తమకాళ్లపై తాము నిలబడేందుకు ఇదొక ఆసరా. సమాజంలో నిర్భాగ్యులకు కొండంత అండ. ఆహ్వానించదగ్గ ఆర్థిక సాయం.నాలుగు లక్షలమంది నిరుద్యోగులను గ్రామ వాలంటీర్లుగా నెలసరి అయిదువేల రూపాయల వేతనంతో నియమిస్తామంటూ జగన్ చేసిన ప్రకటన చాలా కీలకమైనది. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడానికి పక్కా వ్యవస్థకు ఇది దోహదం చేస్తుంది. రాజకీయ కార్యకర్తలకే ఈ ఉద్యోగాలు దక్కుతాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలన్నీ వీరి ద్వారానే ఇంటింటికి అమలు చేయించడం వల్ల పార్టీ పట్ల లబ్ధిదారుల్లో విధేయత పెంచే కార్యక్రమం నిరంతరం సాగుతుంటుంది. అమలులో ప్రభుత్వ యంత్రాంగం పాత్రను తగ్గించడం వల్ల పథకాల్లో అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. కార్యకర్తలే వాలంటీర్లుగా ఉంటారు కాబట్టి పార్టీ ని తప్పుదోవ పట్టించకుండా నిరంతరం సమీక్షించడం సాధ్యమవుతుంది. అందులోనూ సంక్షేమ పథకాల రూపంలో ఏటా 40 వేల కోట్ల రూపాయలవరకూ ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ వాలంటీర్లకు ఏడాదికి 2400 కోట్ల వరకూ ఖర్చవుతుంది. పథకాలపై పార్టీ పట్టు సాధ్యపడుతుంది. ప్రభుత్వాధికారుల దయాదాక్షిణ్యాలపై లబ్ధిదారులు ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉంటూ సంబంధిత పరిధిలోని ప్రజలను పార్టీకి విశ్వాసపాత్రులుగా మార్చగలుగుతారు. మూకుమ్మడిగా అందరికీ సంతర్పణగా ఇచ్చే నిరుద్యోగభృతి కంటే ఇది పక్కా ప్లాన్ గా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.అయితే గ్రామ వాలంటీర్ వ్యవస్థ దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీపైన, ప్రభుత్వంపైన ఉంటుంది. తెలుగుదేశం హయాంలో ఎటువంటి జీతభత్యాలు లేకుండా ఏర్పాటైన జన్మభూమి కమిటీలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. అవినీతికి ఆస్కారమిచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి జన్మభూమి కమిటీలు కూడా ప్రధానకారణంగా పేరుపడ్డాయి. కమ్యూనిస్టు పార్టీల్లో పూర్తిస్థాయి పనిచేసే కార్యకర్తలను నియమించుకునే సంప్రదాయం ఉంది. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వీరి ప్రధాన బాధ్యత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న వాలంటీర్ల వ్యవస్థ కూడా ఇదే తరహాలో ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందించడం వీరి టార్గెట్. అవినీతి రహితంగా సంక్షేమ పథకాలను అమలు చేయించి పార్టీని పటిష్ఠపరచడం వీరి లక్ష్యం. అయితే జన్మభూమి కమిటీల తరహాలో దుర్వినియోగానికి పాల్పడితే పార్టీకి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి వ్యవస్థలు పక్క దారి పట్టకుండా చూసుకుంటేనే సత్పలితాలు దక్కుతాయివృద్దాప్య పింఛన్ల మొత్తం పెంపుదల, వాలంటీర్ల నియామకం, అవినీతి కాంట్రాక్టుల రద్దు, జవాబుదారీ తనం పెంచేందుకుగాను కాంట్రాక్టులపై చెక్ నిమిత్తం జ్యుడిషియల్ కమిషన్ నియామకం వంటివన్నీ ఒక ఎత్తు. మీడియాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామంటూ ప్రమాణస్వీకార వేదికనుంచే జగన్ హెచ్చరించడం గమనించదగ్గ పరిణామం. ఇష్టమొచ్చినట్లు రాసినా, వార్తలు ప్రసారం చేసినా చట్టప్రకారం పరువు నష్టం దావాలు వేస్తామంటూ ఆయన చేసిన ప్రసంగం ముందస్తు హెచ్చరికగానే పరిగణించాలి. తన సొంత మీడియాను మినహాయించి మిగిలిన మీడియాతో తొలి నుంచీ వైసీపీకి విభేదాలున్నాయి. దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని బద్నాం చేయవచ్చని జగన్ గ్రహించారు. అందుకే పరువు నష్టం దావాల ప్రస్తావన తెచ్చారు. అమ్మ ఒడి, రైతు భరోసా, మద్యపాన నిషేధం వంటి భారీ పథకాల విషయాన్ని జగన్ ప్రస్తావించలేదు. వీటిపై కసరత్తు చేయలేదా? లేకపోతే వెంటనే వీటి అమలుకు పూనుకుంటే ఆర్థికంగా మునిగిపోతామని గ్రహించారో కానీ తెలివిగా నవరత్నాల్లో కీలకమైన విషయాలను పక్కనపెట్టారు. ఏదేమైనప్పటికీ జనసమ్మోహక శక్తిగల నాయకుడు అధికారంలోకి రావడంతో ఎటువంటి నిర్ణయమైనా ధృఢంగా తీసుకోగలుగుతారు. యంత్రాంగం కూడా కట్టుతప్పి వ్యవహరించదు. ఆంధ్రప్రదేశ్ కు ఇదొక శుభపరిణామమే.