యువ్ న్యూస్ జనరల్ బ్యూరో
ఈ నెల 6వ తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరేబియ సముద్ర దక్షిణ భాగంతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బెంగాల్, అండమాన్-నికోబార్ దీవులపై రుతుపవనాలు కేంద్రీకృతమైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రంలోని అన్ని భాగాలను రుతుపవనాలు కవర్ చేయనున్నట్లు ఐఎండీ సీనియర్ అధికారి మహాపాత్ర తెలిపారు.ఈ ఏడాది కరవుతీరా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్-సెప్టెంబరు మధ్య సగటు వర్షపాతంలో 96 శాతం నమోదవుతుందంటూ రైతులకు తీపి కబురు చెప్పింది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతమే నమోదవుతుందంటూ ఏప్రిల్ 15న ఇచ్చిన తొలి అంచనా నివేదికలో మరింత సమాచారం జోడించిన వాతావరణ శాఖ శుక్రవారం రెండో దశ నివేదికను విడుదల చేసింది. చివరి రెండు నెలలకు సంబంధించిన తుది నివేదికను జూలై చివరిలో ఇవ్వనున్నట్టు తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీనమైన ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయని, నైరుతి ముగిసే వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఖరీఫ్‌కు ఎంతో కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా 95 శాతం, 99 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.గత నెల 18న అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 25నాటికి మాల్దీవులు, కొమరన్ తీరం వరకు విస్తరించాయి. ఆ తరువాత 4 రోజుల వరకు స్థిరంగా ఉన్న రుతుపవనాలు మే 30న అండమాన్‌లోని అన్ని ప్రాంతాలు, ఆగ్నేయ, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి.