YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో పెను దుమారం

టీడీపీలో పెను దుమారం

రెండుగా చీలిపోయిన అనకాపల్లి మండల నేతలు

ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ప్రచ్ఛన్న యుద్ధం

తాజాగా ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ పదవిపై వివాదం

సంస్థ సొమ్ము రూ.1.5 కోట్లను ముగ్గురు ఎమ్మెల్యేలు పంచుకున్నారని ఒక వర్గం నేతల తీవ్ర ఆరోపణ

తుమ్మపాలలో బహిరంగ సమావేశం

మలసాలకు పదవిపై ఏకగ్రీవ నిర్ణయమంటున్న ఎమ్మెల్యే పీలా గోవింద

తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య రగడ తీవ్రరూపం దాలుస్తున్నది. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండగా, ఇప్పుడు ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ పదవి విషయమై అనకాపల్లి మండల నాయకులు రోడ్డెక్కారు. ప్రతి నెలా ఆర్‌ఈసీఎస్‌ సొమ్ము కోటిన్నర రూపాయలను ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి పంచుకుంటున్నారని బుధవారం తుమ్మపాలలో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సమావేశంలో కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని చెప్పారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ... కొద్ది రోజుల నుంచి ఎడమొహం పెడమొహంగా వుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ విషయమై వీరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నట్టు సమాచారం.గతంలో ఒక సందర్భంలో మంత్రి గంటా శ్రీనివాసరావు... వచ్చే ఎన్నికల్లో ముత్తంశెట్టి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, నువ్వు(పీలా గోవింత సత్యనారాయణ) ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. దీనిపై పీలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ మధ్య సఖ్యత కొరవడింది.

 

ఇటీవల జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం ప్రాంగణంలో ఇరువురి మధ్య విభేదాలు బయటపడ్డాయి. తరువాత ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన జన్మభూమి ముగింపు కార్యక్రమం, తాజాగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో వేదిక వెనుక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఎంపీ ముత్తంశెట్టి ఫొటో లేదు. దీంతో ఎంపీ వర్గీయులు చిన్నబుచ్చుకున్నారు. అంతకు ముందు కొత్తూరు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో కూడా ఎమ్మెల్యే, ఎంపీలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. ఇప్పుడు ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ పదవి కోసం అనకాపల్లి మండలానికి చెందిన తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. కొఠాన అప్పారావు చైర్మన్‌ పదవీకాలం ముగియడంతో, ఈసారి ఆ పదవిని అనకాపల్లి మండలానికి కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

సంస్థ చరిత్రలో ఇంతవరకు అనకాపల్లి మండలం నుంచి ఒక్కరికి కూడా చైర్మన్‌ అవకాశం రాలేదని గుర్తు చేస్తున్నారు. అయితే కశింకోట జడ్పీటీసీ సభ్యురాలు మలసాల ధనమ్మ భర్త రమణరావుకు ఈ పదవిని ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అనకాపల్లి మండల నాయకులు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించి, ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ పదవిని అనకాపల్లి మండలానికి కేటాయించాలని తీర్మానాలు చేశారు. ఒకవేళ పదవి ఇవ్వకపోతే ఎంపీ, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లరాదని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక్క రోజు కూడా గడవకముందే కొంత మంది నాయకులు ఎమ్మెల్యే పీలా ఇంటికి వెళ్లి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.అయితే బుధవారం కొంతమంది నాయకులు, కార్యకర్తలు తుమ్మపాలలో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను బహిరంగంగా విమర్శించారు. ముగ్గురూ కలిసి ఆర్‌ఈసీఎస్‌ సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారని, ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

అందరి ఆమోదం మేరకే మలసాలకు పదవి: ఎమ్మెల్యే పీలా

ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ పదవిని ఈ దఫా అనకాపల్లి నియోజకవర్గానికి కేటాయించాలని ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయించుకున్నాం. పెందుర్తి, ఎలమంచిలి ఎమ్మెల్యేలతోపాటు మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా మలసాల రమణరావుకు చైర్మన్‌ పదవి ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. ఈ విషయంలో నా సొంత నిర్ణయం ఏమీ లేదు.

Related Posts