తెలుగు సినిమారంగంలో లేడీ అమితాబ్‌గా ఒక వెలుగు వెలిగిన లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి సుమారు 13 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ వెండితెరపై కనువిందు చెయ్యనున్నారు. మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా రాములమ్మ తన అనుభూతిని తెలియజేశారు. కాస్త ఎక్కువ విరామం తరువాత మరొకసారి ఆర్టిస్ట్‌గా 2020లో మహేష్ బాబు కాంబినేషన్లో ప్రజల ముందుకు తాను వస్తున్నానన్నారు. తెలుగులో తన మొదటి సినిమా ‘కిలాడి కృష్ణుడు’ కంటే ముందు తమిళంలో తొమ్మిది సినిమాలు చేశానని తెలిపారు. అయితే సూపర్‌స్టార్ కృష్ణ కాంబినేషన్లో నటించడంతో తన నట ప్రస్థానానికి ప్రాముఖ్యత కలిగిందని ఆమె పేర్కొన్నారు. సినిమాల పట్ల తనకు ఇప్పటికీ అదే గౌరవం ఉందని, కళాకారిణిగా అదే అంకితభావంతో ఉన్నానని, దైవ సంకల్పమో, దీవించిన ప్రజల అభిమాన ప్రభావమో ఈ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నానని విజయశాంతి తెలిపారు. ఒక బాధ్యతగా ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 180కి పైగా సినిమాల్లో నటించిన విజయశాంతి దాదాపు 13 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.