ఏపీలో ఎన్నికలు పూర్తయిన వెంటనే వైసీపీ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు ఏ స్థాయిలో వినిపించాయో... రోజాకు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే ఊహాగానాలు కూడా అదే స్థాయిలో చక్కర్లు కొట్టాయి. మొదట్లో రోజాకు జగన్ కేబినెట్‌లో హోంమంత్రి పదవి దక్కుతుందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత సోషల్ మీడియాలో ఆమెకు విద్యుత్ శాఖను కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో గెలిచేంతవరకు ఆమె ఈ వార్తలపై పెద్దగా స్పందించలేదు. తన గెలుపుపై అనుమానం కారణంగానే ఆమె దీనిపై స్పందించలేదని టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టుగానే స్వల్ప మెజార్టీతో రోజా గెలిచారు.గెలిచిన అనంతరం తనకు మంత్రి పదవి అంటూ వస్తున్న ఊహాగానాలపై స్పందించిన రోజా... జగన్ ఏ బాధ్యత ఇచ్చినా తనకు ఓకే అని అన్నారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు మొదలుపెట్టడంతో మరోసారి రోజాకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్న అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రి పదవుల కేటాయింపు విషయంలో జగన్ ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనే అంశంపైనే రోజాకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే అంశం ఆధారపడి ఉంటుందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మహిళా మంత్రుల కోటాలో రోజాకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందనే టాక్ ఉంది. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపించిన వారిలో రోజా ముందున్నారు. ఇది కూడా ఆమెకు కలిసొచ్చే అంశం. ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని జగన్ భావిస్తే... చిత్తూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రోజాకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ధీమా రోజాలో కనిపించడం లేదని... గెలుపు కోసం టెన్షన్ పడినట్టుగానే... మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే అంశంలోనూ ఆమె టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.