యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం.
ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం.
ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు.
దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.
అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది.
వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి..,
వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.
అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే.
కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం:.
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు.
నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు.
ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది. జై గణేశా..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!