ఈ ఆలయంలో ఎక్కడ చూసినా ఎలుకలే ఎలుకలు...
వేల సంఖ్యలో ఎలుకలు...
గుంపులు గుంపులుగా ఎలుకలు..
ఎవరి పాదాల మీదుగా ఆ ఎలుకలు పరుగులు తీస్తాయో వారికి అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు..
అదృష్టం కలిసొచ్చే కాలం దగ్గర్లోనే ఉన్నట్టు..భక్తుల నమ్మకం.
ఎలుకలు ఉన్న ప్రసాదమే భక్తులకు పంపకాలు..
ఇలా ఎన్నో వింతలు గల ఈ ఆలయానికి వెళ్లొద్దాం రండి...
ప్రపంచంలో ఎలుకలకు ఆలయం ఉన్న ఒకే ఒక్క ప్రాంతం మన దేశంలోని రాజస్థాన్‌లోని దేష్నోక్ గ్రామం.
ఇది రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. బికనీర్ జిల్లాను ఒంటెల దేశంగా పిలుస్తారు.
దేష్నోక్ గ్రామాన్ని గతంలో ‘దస్‌నోక్’ అని పిలిచేవారు.
ఈ గ్రామం పది చిన్నగ్రామాల మూలల భాగాల నుంచి ఏర్పడింది కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు.
ఈ గ్రామమే కర్ణిమాత దేవాలయానికి ప్రసిద్ధి. పాలరాతి గోడలు.. వెండి ద్వారాలు..
హిందువుల దేవతైన దుర్గామాత మరో అవతారమే కర్ణిమాతగా కొలుస్తారు.
సిందూరం రాసిన ఏకశిల మీద అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది.
ఒక చేత త్రిశూలం, మరో చేత రాక్షస తల పట్టుకొని సింహవాహినిగా భక్తుల చేత పూజలందుకుంటుంది. జోధ్‌పూర్, బికనీర్ రాజవంశీయులకు కర్ణిమాత కులదైవం. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం 20వ శతాబ్దపు మొదట్లో పునర్నిర్మించారు. మొఘలుల శిల్పకళానైపుణ్యం ఇక్కడి గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆలయం ముందు భాగమంతా పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది. వెండి తాపడం చేసిన ద్వారాలు అబ్బురపరుస్తాయి.ఈ ఆలయానికి వెండి ద్వారాలు, నగిషీలు చెక్కిన పాలరాతిని హైదరాబాద్‌కు చెందిన కర్ణి ఆభరణ తయారీదారులు ఇచ్చినట్టు కథనాలు ఉన్నాయి.
ఈ ఆలయంలోనే దాదాపు 20 వేలకు పైగా ఎలుకలు ఉన్నాయి.
భక్తుల రాకపోకలకు ఏమాత్రం జంకకుండా అవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.
భక్తుల పాదాల మీదుగా పరుగులు తీస్తుంటాయి.
భక్తులు పెట్టిన నైవేద్యాలను, పాలు, పెరుగు, పండ్లు, స్వీట్లు ఆరగిస్తుంటాయి.
కథలకు నెలవు కర్ణిమాత.
కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు.
ఈమె 150 సంవత్సరాలు జీవించిందని తెలుస్తోంది. పుట్టుకతోనే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం.
తనకున్న శక్తులతో పేదలు, భక్తుల సమస్యలు పరిష్కరించేదని ప్రతీతి.
అందుకే ప్రజలు ఆమెను దేవతలా కొలవడం ప్రారంభించారు. ఒకరోజు ఆమె ఆకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది. ఎవరికీ కనిపించలేదు. ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి, నాటి నుంచి పూజలు జరిపారు.
కొంతకాలానికి భక్తులతో ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని..
వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని..
వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందట.ఆ సమయంలో కర్ణిమాత వంశంలో దాదాపు 600 కుటుంబాలు ఉండేవట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు ఆ కుటుంబాల వారంతా మరణించడం..
ఆ తర్వాతే ఈ ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావడం చూసిన వారంతా కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించారు. నాటినుంచే ఈ ఎలుకలను కర్ణిమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారట.ఆలయం వద్ద దాదాపు 20 వేల ఎలుకలు తిరుగాడుతుండటం వెనక మరో జానపద కథ కూడా వినిపిస్తుంది.
20 వేల మంది బలమైన సైన్యం ఒకానొక యుద్ధంలో ఓడిపోయి, పారిపోయి దేష్నోక్ గ్రామానికి చేరుకుంది.ఆ ప్రాంతానికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని..దానికన్నా మరణమే మేలు అని తెలుసుకున్న వారు తమకు తామే మరణశిక్ష విధించుకున్నారు. కర్ణిమాత వారి ఆత్మహత్య దోషం పోవడానికి ఈ ఆలయంలో ఎలుకలుగా ఉండిపొమ్మని చెప్పిందట. సైనికులంతా కర్ణిమాతకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడే ఉండిపోయారట.
అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్టుగా భావిస్తారు.
ఇక్కడ ఎలుకల రెట్టలు గానీ, వాటి నుంచి ఎటువంటి వాసన కూడా రాకపోవడం విచిత్రం.తెల్లని ఎలుకలు దేవతాస్వరూపాలు.
వేల కొలది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కనిపించడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కర్ణిమాతకు ముగ్గురు పిల్లలు పుట్టి పురిట్లోనే కన్నుమూశారు.
దీంతో ఆమె తన భర్తకు సొంత చెల్లెలినే ఇచ్చి వివాహం చేసింది.
వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ కపిల్ సరోవర్‌లో పడి చనిపోయాడు.
కర్ణిమాత ఆ బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకుంది.
యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదు.
కర్ణిమాత దుర్గాదేవి అనుగ్రహంతో ఆ కుమారుడిని బతికించుకుంది.
అంతేకాదు ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా ముగ్గురు బిడ్డలూ తిరిగి బతికారట.ఈ ఆలయంలో కనిపించే నాలుగు తెల్లని ఎలుకలు కర్ణిమాత బిడ్డలేనని..
ఆ నాలుగు ఎలుకలు కనిపించిన వారికి కర్ణిమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తుల నమ్మిక.
అందుకే ఆ నాలుగు తెల్లని ఎలుకలు కనిపించేదాక భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం విశేషం.
ివిధ ప్రాంతాలలో కర్ణిమాత..
ఉదయపూర్ మచ్లా హిల్స్‌లో మరో కర్ణిమాత దేవాలయం ఉంది.
అలాగే రాజస్థాన్ చారిత్రక పట్టణమైన అల్వార్‌లో కర్ణిమాత దేవాలయం ఉంది.
ఇక్కడ అమ్మవారి మూర్తిని దర్శించుకోవచ్చు గానీ, ఎలుకలు మాత్రం ఉండవు.
వెండి ఎలుక..
ఎలుకలకు ఆహారం ఇవ్వడం గొప్ప వరంగా భక్తులు భావిస్తారు.
అయితే, ఈ ఆలయంలో పొరపాటున ఎవరి వల్లనైనా ఎలుక చనిపోతే వారు అంతే బరువు గల వెండి ఎలుకలను ఆలయానికి ఇచ్చి దోషాన్ని పోగొట్టుకోవాలి. అమ్మవారి ఎదుట ఎలుకలున్న నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా పంచుతారు.
ఏడాదికి రెండుసార్లు ఉత్సవాలు..
కర్ణిమాత ఆలయంలో ఉదయం 4 గంటలకు తొలి పూజ మొదలవుతుంది.
పూజారులు అమ్మవారికి నైవేద్యాలు, మంగళహారతి సమర్పించి, మృదంగ ధ్వనులను వినిపిస్తారు.
అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటకు వస్తాయి.
పెద్ద పెద్ద పళ్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆబగా ఆరగిస్తాయి.
ఆ తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ, ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి.
తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్లిపోతాయి.
ప్రతీ ఏటా ఈ ఆలయంలో మొదటి వేడుక చైత్ర మాసంలో (మార్చ్-ఎప్రిల్) లో..
రెండవ వేడుక ఆశ్వీయిజ మాసం( సెప్టెంబర్ - అక్టోబరు) లో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
ఈ నవరాత్రుల సందర్భంగా వేలాది భక్తులు కాలినడకన అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు.
ఎలా వెళ్లాలంటే..
బికనీర్ ప్రాంతానికి దేష్నోక్ 30 కిలోమీటర్ల దూరం..
బికనీర్ నుంచి దేష్నోక్ చేరుకోవడానికి బస్సు సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి టికెట్ రూ.20
దేష్నోక్ కి విమాన, రైలు, రోడ్డు ప్రయాణాలలో తేలికగా చేరుకోవచ్చు.
సమీప విమానాశ్రయం జోధ్‌పూర్‌లో ఉంది.
ఇక్కడ నుంచి కలకత్తా, చెన్నై, బెంగుళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు విమాన సదుపాయాలున్నాయి
జోధ్‌పూర్‌లో రైల్వేస్టేషన్ ఉంది
ఆగ్రా,
ఢిల్లీ,
అజ్మీర్,
జోధ్‌పూర్,
అహ్మదాబాద్,
జైపూర్,
జైసల్మేర్,
ఉదయపూర్,
బర్మార్..
నగరాల నుండి ప్రతిరోజూ బస్సు సదుపాయాలున్నాయి
అన్ని కాలాలలోనూ ఉష్ణోగ్రతలు అధికమే.
సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి నెలలు సందర్శనకు అనుకూలం
ఇక్కడ విజయ్స్ గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి.
వీటిని క్యామెల్ మ్యాన్స్ గెస్ట్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇందులో గది రూ.500 నుంచి రూ. 800లకు లభిస్తాయి. అల్పాహారం రూ.125, లంచ్ 150, డిన్నర్ 150.
వైఫై సదుపాయం ఉంటుంది.
కంప్యూటర్ ఉపయోగించుకోవాంటే గంటకు రూ. 60.
సమీప దర్శనీయ స్థలాలు:
బికనీర్ జిల్లాలో జునాగఢ్ కోటతో పాటు పెద్ద పెద్ద మహల్‌లు ఉన్నాయి.
లాల్‌గడ్ ప్యాలెస్,
శివ్‌బరి ఆలయం,
గంగా గోల్డెన్ జూబ్లీ మ్యూజియమ్,
గజ్నేర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం,
ప్రాచీన మ్యూజియమ్,
కోట్ గేట్,
భండాసర్ జైన్ టెంపుల్,
ఒంటెల జాతీయ పరిశోధన కేంద్రం,
లక్ష్మీనారాయణ దేవాలయం,
ఎర్రటి రాతి కోటలు,
కట్టడాలు ..
ఇలా ఎన్నో సందర్శించదగినవి ఈ ప్రాంతంలో కొలువు దీరాయి...