యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోక్ సభ ఎన్నికల తరువాత దేశంలో రాజకీయాలు మరోసారి పూర్తిగా మారిపోయాయి. ఇక ఏపీలో టీడీపీ అధికారం కోల్పోవడంతో పాటు కేంద్రంలో బీజేపీ మరింత ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి రావడం చంద్రబాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు... ఎన్నికల ముందు స్నేహం చేసిన కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తిగా దూరమైనట్టు కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వడివడిగా కాంగ్రెస్‌తో స్నేహం చేసే దిశగా అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పలుసార్లు కలిసి చంద్రబాబు... ఆయనకు మరింత దగ్గరయ్యారు. ఎన్నికల ఫలితాలు రాకముందే కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పాటు కోసం మిత్రపక్షాలను ఏకం చేసేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగారు. అయితే తానొకటి తలిస్తే... దైవం మరొకటి తలిచిందన్న చందంగా చంద్రబాబు అంచనాలన్నీ పూర్తిగా తారుమయ్యారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ మాత్రం పుంజుకోకపోగా... బీజేపీ అనూహ్యంగా తన బలం పెంచుకుని మరోసారి సొంతంగా అధికారంలోకి రావడం చంద్రబాబుకు శరాఘాతంగా మారింది. ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్‌తో కలిసి ఉన్న పాత మిత్రులంతా మళ్లీ ఆ పార్టీతో స్నేహంగా ఉంటున్నా... చంద్రబాబు మాత్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తానని సంచలన సృష్టించినా... ఈ అంశంపై చంద్రబాబు, టీడీపీ స్పందించలేదు. దీంతో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పూర్తి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాజకీయంగా తమ బద్ధశత్రువు, ఏపీ విభజనకు కారణమైన కాంగ్రెస్‌తో పని చేయడం టీడీపీ శ్రేణులకు అంతగా ఇష్టం లేదనే చెప్పాలి. అయితే జాతీయ రాజకీయాల్లో అవసరాల దృష్యా కాంగ్రెస్‌తో కలిసి ముందుకు నడవక తప్పని పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు పార్టీ నేతలకు నచ్చజెప్పారు. కొన్ని నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అత్యంత సన్నిహితంగా మారిపోయారు. అయితే ఎంత వేగంగా కాంగ్రెస్‌కు దగ్గరయ్యారో... లోక్ సభ ఫలితాల తరువాత అంతే వేగంగా ఆయన ఆ పార్టీకి దూరమయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.