జగన్ ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టినకానుంచి కీలక మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ మధ్య ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ విభజన తర్వాత హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేశారు. దీంతో అప్పటి సీఎం చంద్రబాబు ఒక్క ఏడాది కూడా హైదరాబాద్‌లో ఉండకుండానే... తట్టా బుట్టా సర్దుకొని అమరావతికి వెళ్లిపోయారు. ఉద్యోగుల్ని కూడా తీసుకువెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లో పెద్దగా ఎలాంటి అధికారిక కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. అయితే ఇప్పుడు జగన్ సీఎం అయాక ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. శనివారం గవర్నర్ రాజ్‌భవన్ విందుకు హాజరైన సందర్భంగా ఇదే విషయమై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.గవర్నర్ సమక్షంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఇరువురు సీఎంల మధ్య, గంట సేపు జరిగిన చర్చల్లో రెండు రాష్ట్రాల్లో ఆదాయాల పెంపు, వనరుల వినియోగం లాంటి అంశాలపై సమన్వయంతో పనిచేద్దాం అనే నిర్ణయానికి వచ్చారు. మీటింగ్ ముగిసి, ఇఫ్తార్‌కు వెళ్లే సమయంలో, కేసీఆర్ జగన్ భుజం పై చేతులు వేసి అప్యాయంగా మాట్లాడారు. '' హైదరాబాద్‌లో మీకు నచ్చిన ప్రభుత్వ భవనాన్ని తీసుకుని ఏపీ క్యాంపు కార్యాలయంగా మార్చుకోండి. నెలలో కొన్ని రోజులు ఇక్కడే పని చేయండి '' అని సలహా ఇచ్చారు. దీంతో హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీసును సెక్రటేరియట్‌లోనే ఏర్పాటు చేసుకోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భవనాలనే పైసా ఖర్చులేకుండా వినియోగించు కోవాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్లు సమాచారం.త్వరలో జగన్ వారానికి రెండు రోజులు హైదరాబాద్ క్యాంప్ ఆఫీసుకు రానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని అంశాలతో పాటు హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు అప్పగింత, ఉమ్మడి రాజధానిలోని సంస్థల ఆస్తులతో పాటు ఉద్యోగుల విభజన తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయబోతున్నారు. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న విభజన సమస్యలను సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లకుండానే ఇరు రాష్ట్రాల స్థాయిలోనే పరిష్కరించుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆరు నెలల్లోగా ప్రతి సమస్యకూ పరిష్కారం చూపాలనే ఇద్దరు సీఎంల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది.