YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజ్యసభలో టీడీపీ వాషఔట్...

రాజ్యసభలో టీడీపీ వాషఔట్...

యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ పెద్దల సభలో ఖాళీ కాబోతుందా? పెద్దల సభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం ఉండదా? అవును అనే అంటున్నారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 23 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ స్థానాలతో భవిష్యత్తులో వచ్చే రాజ్యసభ స్థానాలను టీడీపీ దక్కించుకునే పరిస్థితులు కన్పించడం లేదు. రానున్న రోజుల్లో రాజ్యసభ స్థానాలు ఏపీలో ఖాళీ కాబోతున్నాయి. వాటిని సాధించుకోవడం టీడీపీకి సాధ్యమయ్యే పనికాదు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇంతటి దారుణ ఓటమిని చవిచూడలేదు. 1989లోనూ ఎన్టీఆర్ హయాంలో 74 స్థానాలు వచ్చాయి. 2004లోనూ చంద్రబాబు సారథ్యంలో 46 స్థానాలు దక్కాయి. ఆ సంఖ్యను 2009 ఎన్నికల్లో 90 స్థానాలకు పెంచుకోగలిగింది తెలుగుదేశం పార్టీ. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం 175 స్థానాలకు గాను కేవలం 23 సీట్లను మాత్రమే సాధించింది. ఈ సంఖ్యతో ఇటు ఎమ్మెల్సీలను, అటు రాజ్యసభ సభ్యులను గెలుచుకునే పరిస్థితులు లేవు. సంఖ్యాపరంగా బలహీనంగా ఉండటంతో ఖాళీ అయిన ప్రతి స్థానమూ వైసీపీ ఖాతాలోకే వెళుతుంది.రాజ్యసభలో మొత్తం 11 మంది సభ్యులు ఏపీకి చెందిన వారు ఎంపికవుతూ వస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఐదుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. కే.కేశవరావు,కేవీపీ రామచంద్రరావులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితో పాటు ఎం.ఎ.ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. వచ్చే ఏడాది ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాలూ వైసీపీకే దక్కనున్నాయి.
ఇక 2022 నాటికి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లు పదవీ విరమణ చేయనున్నారు. 2024 లో కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్ ల పదవీ కాలం కూడా పూర్తవుతుంది. దీంతో ఈ సంఖ్యాబలం ఉండగానే ఈ నాలుగు స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అదే జరిగితే ఈ స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకుంటుంది. అప్పుడు పెద్దల సభలో తెలుగుదేశాం పార్టీ వాయిస్ విన్పించదు. మొత్తం మీదవచ్చే ఐదేళ్లలో దాదాపు తొమ్మిది రాజ్యసభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుంది.

Related Posts