యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
2019 ఎన్నికల్లో జగన్ ఖచ్చితంగా సీఎం అవుతారు’ అని ఆశాభావం వ్యక్తం చేస్తూ వైసీపీ పార్టీలో జాయిన్ అయిన సినీ నటి జయసుధ.. అన్నట్టుగానే జగన్ సీఎం అయ్యారు. దీంతో జగన్ టీంలో కీలక పదవిని చేపట్టబోతున్నారు జయసుధ. ‘వైసీపీ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తా. ప్రత్యేకించి ఎక్కడ నుండి పోటీ చేయాలనుకోవడం లేదు. జగన్ ఆదేశాలనుసారం పార్టీకి సేవచేస్తా’ అని ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జయసుధ.. జగన్ గెలుపుతో నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ తరుపున నామినేటెడ్ పోస్ట్ వరుసగా ఖాళీ కావడంతో ఆయా స్థానాల్లో కీలకమైన ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారట జయసుధ. గతంలో ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి ఉండటంతో పాటు వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేయడం.. ఇండస్ట్రీ పెద్దలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి జయసుధ అయితే బావుంటుందనే అభిప్రాయంలో ఉన్నారట జగన్. అయితే ఈ పదవికి జయసుధతో పాటు చాలా మంది ఇండస్ట్రీ నటులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో జయసుధతో పాటు.. మోహన్ బాబు, జీవిత, రాజశేఖర్, పృథ్వీ, పోసాని, హేమ, రాజా రవీంద్ర, భాను చందర్, కృష్ణుడు, శ్యామల ఇలా చాలా మంది వైసీపీ తరుపున ప్రచారం చేశారు. వీరిలో జయసుధ, మోహన్ బాబు, జీవిత, రాజశేఖర్‌లు నామినేటెడ్ పోస్ట్‌లు ఆశిస్తున్నవారిలో ఉన్నారు.ఇప్పటికే మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ కాబోతున్నారని ప్రచారం నడుస్తుండగా.. జయసుధ ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ కాబోతున్నారని తెలుస్తోంది. టీడీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా చేసిన అంబికా క్రిష్ణ ఇటీవల రాజీనామా చేయడంతో రేసులోకి వచ్చారు జయసుధ. అయితే ఈ రేస్‌లో మోహన్ బాబు పేరు కూడా ఉండటం విశేషం.