యువ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓటమి అలా ఇలా కాదుట, భారీ ఆధిక్యతతోనే వెనకబడిపోయి ఓటమి పాలు అయ్యారని తెలుస్తోంది. అతి పెద్ద నియోజకవర్గమైన గాజువాకలో కౌంటింగ్ కూడా బాగా లేట్ అయింది. అర్ధరాత్రి 12 గంటలకు ఇంకా ఆరు వేల ఓట్లు మిగిలి ఉండగానే వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి విజయం సాధించినట్లుగా లెక్క తేల్చారు. అప్పటికి నాగిరెడ్డికి 17 వేల పై చిలుకు ఆధిక్యత పవన్ మీద లభించింది. ఇంకా ఏడు ఈవీఎంలలో కౌంటింగ్ చేయాల్సివుంది. అయితే భారీ మెజారిటీ రావడం, ఆ ఆరువేలు కలిపినా కూడా గెలుపు అంచులకు అటు జనసేన ఇటు టీడీపీ చేరుకోలేవని డిసైడ్ అయి కౌంటింగ్ ఏజెంట్లు కూడా వెళ్ళిపోయారుట.ఇక ఆ ఏడు ఈవీఎంలలో ఆరు వేలకు పైగా ఓట్లు లెక్కపెట్టకుండానే వదిలేసి విజయం డిక్లేర్ చేశారు. దాని మీద వైసీపీ నాయకులు తాజాగా మాట్లాడుతూ అప్పటికే అర్ధరాత్రి కావడం, గెలుపు పక్కాగా తేలిపోవడంతో కౌంటింగ్ చేయడం ఆపేశారని చెప్పారు. ఆ ఏడు ఈవీఎంలను కూడా లెక్క కడితే మాత్రం అందులో కూడా సగానికి పైగా ఓట్లు నాగిరెడ్డికి కచ్చితంగా వచ్చేవని అపుడు ఆయన మెజారిటీ 20 వేల పై చిలుకు ఉండేదని అంటున్నారు. ఈ లెక్క ఇపుడు ఎందుకు తీస్తున్నారంటే ఇందుకు కూడా వేరే కారణం ఉంది.పవన్ కళ్యాణ్ లాంటి సినిమా స్టార్ ని ఓడించడం అంటే తమాషా కాదు, అదీ అయన సొంత కులం బలం దండీగా ఉన్న చోట, ఫ్యాన్స్ భారీగా ఉన్న గాజువాకలో ఓడించి పంపించడం అంటే అది కచ్చితంగా నాగిరెడ్డి గొప్పతనం అని అంటున్నారు. ఇక నాగిరెడ్డి కూడా మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగానే భారీ మెజారిటీ తెచ్చుకున్నారని, పైగా అర్బన్ జిల్లాలో రెండు సీట్లు గెలిస్తే అందులో భీమిలీ ఎమ్మెల్యే అవంతి మెజారిటీ కేవలం పదివేలు మాత్రమేనని గుర్తు చేస్తున్నారు. తిప్పలకు మిగిలిన ఏడు ఈవీఎంలు కలిపితే 20 వేల పై చిలుకు మెజారిటీ వచ్చినట్లేనని చెబుతున్నారు.అందువల్ల ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కూడా డిమాండ్ చేస్తున్నారు. రేపటి రోజున అర్బన్ జిల్లాలో వైసీపీ బలపడాలన్నా, జీవీఎంసీ ఎన్నికల్లో జెండా ఎగరేయాలన్నా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం అవసరమని వాదిస్తున్నారు. పైగా మొదటి నుంచి వైఎస్సార్, జగన్ వెంట ఉన్న నిబద్ధత కలిగిన నేత నాగిరెడ్డి అని కూడా అంటున్నారు . మరి చూడాలి జగన్ ఎలా డిసైడ్ చేస్తారో.