కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతుంది. మంత్రివర్గ విస్తరణ చేస్తే కొంత అసంతృప్తి తగ్గుముఖం పడుతుందని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. లేదు కొందరిని మంత్రివర్గం నుంచి తొలగించి వారి స్థానంలో అసంతృప్త నేతలను నియమించాలని మరికొందరు చెబుతున్నారు. ఇలా ఏం చేయాలో పాలుపోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అధిష్టానాన్ని ఆశ్రయించే పనిలో ఉన్నారు.కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ముదిరింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యలు తరచూ బీజేపీ నేతలను కలవడం వారిని కలవరపరస్తుంది.ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న రెండు పార్టీలదీ తలోదారిగా కన్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయాలని ఆలోచిస్తుంటే, ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం మంత్రివర్గాన్ని సమూలంగా మార్చేల్సిందేనని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉన్న వారిని మంత్రివర్గం నుంచి తొలగించి అసంతృప్తులకు మంత్రి పదవులు ఇవ్వడం, మండలి వంటి పదవులను భర్తీ చేయడం వల్ల అసంతృప్తి నుంచి గట్టెక్కగలుతామని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యూహానికి చెక్ పెట్టగలమని ఆయన ఏకంగా రాహుల్ గాంధీకే చెప్పేసి వచ్చారు.ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ అంటూ కొందరిని తొలగించి మరికొందరని నియమిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయన్నది మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంచనా. సిద్దరామయ్య ముఖ్యనేతలతో దీనిపై చర్చించినా మంత్రి పదవులు వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. తమకు మంత్రి పదవులు దక్కి ఏడాది గడవక ముందే దిగిపొమ్మంటే ఎలా? అని సిద్ధరామయ్యను నిలదీసినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆ ఆలోచన విరమించుకున్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా మాత్రం చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఎమ్మెల్యేల వారీగా బాధ్యులను నియమించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం పూర్తికావడంతో యడ్యూరప్ప సయితం ఇక కాలుదువ్వే అవకాశముంది. దీంతో మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించుకోవాలని కుమారస్వామి, సిద్ధరామయ్యలు నిర్ణయించుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలు ఘోర ఓటమి చవి చూడటంతో ఎవరూ బెట్టు చేసే పరిస్థితి లేదు. వారి ముందున్నది ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే. అందుకే ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశమై వారి నియోజకవర్గాల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందోనని అధికార పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తుండటం, పాలనను పక్కన పడేయటం విమర్శలకు తావిస్తోంది