ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన జగన్.. తర్వలోనే తన కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అభ్యర్థుల సంఖ్యను బట్టి.. 28 మంది వరకు మంత్రులను ఏర్పాటు చేసుకునే వెసులు బాటు ఉంది. గతంలో చంద్రబాబు 25 నుంచి 27 వరకు కూడా మంత్రులను నియమించుకుని పాలన అందించారు. అయితే, ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు వైసీపీ అధినేత జగన్. ఆయన రాకతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని, రాష్ట్ర బవిష్యత్తు మారుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ కోణంలోనే జగన్ కూడా తన అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు.కాస్ట్ కటింగ్‌లో భాగంగా తాను తీసుకునే వేతనాన్ని తగ్గించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయం లో ప్రభుత్వం తరఫున నిర్వహించే కార్యక్రమాలకు వ్యయాన్ని తగ్గించుకునేందుకు జగన్ చర్యలు చేపట్టారు. ఇదిలా వుంటే, రాష్ట్రంలో అవినీతిపై యుద్ధం ప్రకటించారు. నేరుగా సీఎం కార్యాలయంలోనే కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తు న్నారు. దీంతో రాష్ట్రంలో అవినీతిని పెద్ద ఎత్తున అరికట్టేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక, తాజాగా ఆయన మంత్రి వర్గంపైనా దృష్టి పెట్టారు. ముందుగా చిన్న కేబినెట్‌తోనే పాలన సాగించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మొత్తంగా 15 మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు.ప్రస్తుతం ఈ క్రతువుపైనే జగన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గడిచిన తొమ్మిదేళ్లుగా వైసీపీకి అండగా ఉంటున్న వారితో పాటు..తాజా ఎన్నికల్లో జగన్‌పై నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా పెద్ద ఎత్తున పోటీ చేసి గెలుపు గుర్రాలు ఎక్కారు. వీరిలో జగన్‌కు ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఇలా అన్ని వర్గాల వారూ ఉన్నారు. దీనికితోడు.. తన కష్టనష్టాలు పంచుకుని, తనతోపాటు పార్టీని నడిపించిన అనేక మంది ఉన్నారు. మరి వీరందరికీ ఈ కేబినెట్‌లో చోటు కల్పిస్తారా? కేవలం 15 మందితోనే అంటే.. సామాజిక వర్గాల వారీగా చూసుకున్నా.. పార్టీ పరంగా చూసుకున్నా.. అందరికీ న్యాయం చేయడం కష్టమనే అంటున్నారు.ఇక, ఇప్పటికే జగన్ మాట ఇచ్చిన వారిలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఇద్దరూ కూడా గుంటూరు జిల్లా వారే. ఒకరు మర్రి రాజశేఖర్, రెండు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఒకరు కమ్మ, మరొకరు రెడ్డి. ఇక బాలినేనికి ఇప్పటికే హామీ ఇచ్చేశాడు. ఇక, ఈ క్యూలో కనిపిస్తున్న మరోపేరు రోజా. ఎన్నికల ఫలితాలకు ముందుగానే ఆమె పేరు మంత్రి వర్గంలో ఉందనే ప్రచారం సాగింది. అసెంబ్లీలో ఏడాది పాటు సస్పెండ్ అయినా.. పార్టీ తరఫున బలమైన గళం వినిపించారు. ఇలా చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ఉన్నారు ఈ ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు. మరి ఎవరికి దక్కుతుంది? అనే ఆసక్తిగా మారింది. ఇక, మైనార్టీ కోటా, ఎస్సీ, ఎస్టీ, కాపు, బీసీ వర్గాల నుంచి కూడా కేబినెట్లో చోటు తప్పకుండా కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇక, సీనియర్లుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, బొత్ససత్యనారాయణ, తమ్మినేని సీతారాం, కొలుసు పార్థసారధి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, పిన్నెల్లిరామకృష్ణారెడ్డి .. ఇలా అనేక మంది ఎదురు చూస్తున్నారు.మరి ఎవరికి సీటు దక్కుతుందో చూడాలి. అయితే, కేబినెట్‌లో మాత్రం కచ్చితంగా ఐదుగురు సీనియర్లు కాగా, మిగిలిన వారు కొత్తవారు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 13 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారని కూడా అంటున్నారు. ఈ సస్పెన్స్ వీడేందుకు కొంతకాలం వేచి చూడాల్సిందే.