అనుమతులులేని, అనధికారికంగా నిర్వహిస్తున్న చేపలు, రొయ్యల చెరువులపై చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డా. అంజలిని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలలనుండి వచ్చిన ప్రజలనుండి పిర్యాదులు, వినతులు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఉండి మండలం ఉణుదుర్రు గ్రామం, ఉండ్రాజుకోడు శివారు వరిసాగు భూములు అనుమతులు లేని రొయ్యలు,చేపల సాగువల్ల నాశనం అవుతున్నాయని అటువంటి చెరువులను ద్వంశంచేసి పంటపొలాలను కాపాడాలని పర్లికొండ కృష్ణావతారం, దాట్ల వెంకట కృష్ణంరాజు, పైల సత్యనారాయణ మరికొంతమంది రైతులు కలెక్టర్ కు పిర్యాదుచేస్తూ వేడుకున్నారు. సంవత్సర కాలంనుండి కలెక్టర్ వారికి దఫదఫాలుగా స్వయంగా కలిసి విన్నవించామని, మత్స్యశాఖ అధికారులను వేడుకుంటున్నామని అయినా ఫలితంలేదన్నారు. వరిచేలు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయని దిక్కుతోచని స్థితిలో వరిసాగు రైతులు వున్నారని ఇప్పటికైనా న్యాయంచేయాలని వేడుకున్నారు. ఈపిర్యాదుపై కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ఇప్పటివరకు ఏవిధమైన చర్యలుతీసుకున్నదీ నివేదిక సమర్పించాలని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డా .అంజలిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో వరిసాగునష్టానికి జరిగే ఎటువంటి చర్యలను తాను సహించబోనన్నారు. రైతులకు సాగునీరు, పంటలకాలువల సమస్యలు, వ్యవసాయపనులుచేసుకోవడంలో ఇబ్బందులు, పంటపొలాలకు వెళ్లెందుకు దారిమార్గాల సమస్యలు వంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అనేక మంది వివిధసమస్యలపై తమ వినతిపత్రాలు సమర్పించారు.
గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన గాదె ప్రభాకరగుప్త వినతిపత్రం సమర్పిస్తూ, తనకు రి.స .నెం .461/4 లో య.2.56 సెంట్ల వ్యవసాయభూమి ఉందని, అయితే భూమికి సరిహద్దు దారులు వట్టిపోలు కొండయ్య, వట్టిపోలు సత్తిబాబు అనువారు పొలానికి వెళ్లేదారిమార్గం ఆక్రమించుకున్నారని, పొలంలోకి వెళ్లకుండా అడ్టుపడుతూ అడిగినవారిపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. పొలంలోకివెళ్లి పనులు చేసుకునేందుకు, పండిన పంట తెచ్చుకునేందుకు ఆటంకపరుస్తున్నారని పిర్యాదు చేశారు. కుకునూరు మండలం, కుకునూరు గ్రామానికి చెందిన కుచ్చర్లపాటి కేశవభగవాన్ రాజు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తూ గ్రామంలో తనకుగల 65 సెంట్లభూమికి కుచ్చర్లపాటి సత్యనారాయణరాజు, దండు సూర్యనారాయణ రాజు అనే వ్యక్తులు అక్రమంగా అవార్దుచేయించుకున్నారని, దానిపై తాను స్టేఆర్దర్ తెచ్చి సొమ్ము వారికి ఇవ్వకుండా ఆపానని, అయితే అధికారులు సదరువ్యక్తులకు నోటీసులు పంపడం లేదని విన్నవించారు. తనకు రావాల్సిన సొమ్ము ఇప్పించాలని కోరారు. పోలవరం ఆప్తమిత్ర స్వచ్ఛంధ సేవా సంస్థ డైరెక్టర్ శ్రీ ఎం . రంజిత్ కుమార్ వినతిపత్రం సమర్పిస్తూ పోలవరం ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురౌతున్న గ్రామాల నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, ఇతర రాయితీలు, కొత్తపునరావాస గ్రామాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కొత్తగ్రామాలలో పరిశ్రమలు ఏర్పాటుచేసిన నిర్వాసితులకు జీవనోపాధి కల్పించాలని కోరారు. వీరవాసరం మండలం తోలేరు గ్రామానికి చెందిన పి .రమాదేవి, ఎస్ లక్ష్మయ్య, వి.దుర్గ మరికొంతమంది పిర్యాదుచేస్తూ,తోలేరు శివారు పడమటిపాలెం గ్రామంలో కవుల వీరవెంకట సత్యనారాయణ అనేక వ్యక్తి పంటపొలాలకు నీరువచ్చే పంటబోదెలను మట్టితోపూడ్చి ఇళ్లస్థలాలుగా వేస్తున్నారని, దానివల్ల పంటపొలాలకు సాగునీరు రావడంలేదన్నారు. అయిపరాజుగూడెం గ్రామానికి చెందిన ఖండవల్లి ఇమానేయులు,మందలపు రంగారావు, తోట ప్రభావతి మరికొంతమంది అర్జీ ఇస్తూ, ఏలూరులోని డిహెచ్‌పిపిఎల్ అనే సంస్థ వారు ఋణాలు ఇస్తామని డిపాజిట్లు కట్టించుకున్నారని , ఆసంస్థ ప్రస్తుతం మూసివేశారని, పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తమ న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈఆర్జీలపై సంబంధిత అధికారులు విచారణచేసి తగుపరిష్కారంచేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్ది, ట్రైనీ కలెక్టర్ కౌషిక్, డిఆర్ఒ ఎన్ సత్యనారాయణ, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, డిసిహెచ్ఎస్ డా.శంకరరావు, ఆర్ అండ్‌బి ఎస్ఇ నిర్మల, డిఎంఅండ్ హెచ్ఒ డా. సుబ్రహ్మణ్యశ్వరి, ఎల్‌డిఎం సూర్యారావు, డిఇఒ సివి రేణుక, ఐసిడిఎస్ పిడి విజయలక్ష్మి, దివ్వాంగులసంక్షేమశాఖ ఎడి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు