విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ తరఫున పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరికి ఈసారి డిపాజిట్ కూడా దక్కలేదు. కేవలం 38 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న సంతృప్తి మాత్రమే ఆమెకు మిగిలింది. 2009 ఎన్నికల్లో ఇదే విశాఖ నుంచి పోటీ చేసి అరవై వేల ఓట్ల మెజారిటీ తెచ్చుకున్న చిన్నమ్మకు ఈసారి అందులో సగం కూడా ఓట్లు రాకపోవడం ఘోర అవమానమే. అయితే ఇందుకు ఆమె పాత్రతో పాటు, బీజేపీ నేతల సహాయ నిరాకరణ కూడా కారణమని అంటున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన మనిషి డిపాజిట్ కోల్పోవడం అంటే అది దారుణమేనని అంటున్నారు. పైగా అన్న గారి కుమార్తెగా సొంత ఓట్ బ్యాంక్ కూడా ఉండి ఇలాంటి అవమానం జరగడమేంటని కూడా అంటున్నారు.ఇక చిన్నమ్మ రావడమే చివరి నిముషంలో విశాఖలో అడుగుపెట్టారు. ఆమె ప్రచారం కూడా చాలా లేట్ గా మొదలైంది. అసెంబ్లీకి పోటీ చేసిన వారు కూడా ముక్కూ మొహం తెలియని వారే. దాంతో అన్ని విధాలుగా దెబ్బ పడిందని అంటున్నారు. దానికి తోడు బీజేపీ నేతలు ఆమె పట్ల వ్యతిరేకంగా ఉండడం కూడా డిపాజిట్ దక్కక పోవడానికి కారణమని అంటున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న హరిబాబుని పక్కన పెట్టి మరీ చిన్నమ్మ అయితే గెలిచేస్తుందన్న ఆలోచనతో బీజేపీ పెద్దలు చేసిన ప్రయోగం ఇలా విఫలమైందని అంటున్నారు. హరిబాబు ఎన్నికలకు చాలా ముందు నుంచే పార్టీకి దూరంగా జరిగారు. పార్టీ అడిగితే పోటీ చేస్తానని ఆయన అంటూ వచ్చారు. విశాఖకు రైల్వే జోన్ తెచ్చిన నేపధ్యంలో ఆయనకే మళ్ళీ టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు బాగా ఉండేవన్న వాదన కూడా పార్టీలో ఉంది. చిన్నమ్మను తెచ్చి ఓ విధంగా హరిబాబును అవమానపరచారని కూడా ఆయన అనుచరులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశ్చర్యకరంగా వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాజాగా హరిబాబు ఇంటికి వెళ్ళి మంతనాలు జరపడం రాజకీయ వర్గాల్లో చర్చ రేపుతోంది. నిన్నటి వరకూ ఎంపీగా పనిచేశారు కాబట్టి కలిశానని ఎంవీవీ చెబుతున్నా ఆయనకు పెద్దాయన ఆశీర్వాదం బాగానే లభించిదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందడంతో పాటు, చిన్నమ్మ ఎటూ గెలవలేదన్న కారణంగా బీజేపీ ఓట్లు కూడా ఎంవీవీకి పడేలా కమలనాధులు చూశారన్న టాక్ ఇపుడు వినిపిస్తోంది. దీంతోనే చిన్నమ్మకు డిపాజిట్ గల్లంతు అయిందా అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బీజేపీకి జనంలో ఉన్న వ్యతిరేకతతో తోడు, పార్టీలో ఉన్న లుకలుకలు కూడా చివరికి ఘోర ఓటమిని మూటకట్టుకునేలా చేశాయని అంటున్నారు.