తమిళనాడులో 2016లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయింది. జయలలిత మరణం తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ ఆశలు చిగురించాయి. అన్నాడీఎంకేకు సరైన నాయకత్వం లేకపోవడం, శశికళ జైలు పాలు కావడంతో తనకు అన్నీ కలసి వస్తాయని ఆయన భావించారు. 2021 ఎన్నికల కంటే ముందే అధికారం తన చెంత చేరుతుందని ఆయన గట్టిగా నమ్మారు. తండ్రి కరుణానిధి మరణం తర్వాత సీఎం పదవిపై మరింత ఆశలు పెంచుకున్నారు. అన్నాడీఎంకేలో విభేదాలతో పాటు, 21 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు తనను అందలం ఎక్కిస్తాయని భావించారు.అయితే పార్లమెంటు స్థానాల్లో డీఎంకే కూటమికి ఎక్కువ స్థానాలను కట్టబెట్టిన తమిళులు ఉప ఎన్నికల విషయానికి వచ్చే సరికి తొమ్మిది స్థానాలను అధికార అన్నాడీఎంకేకు ఇచ్చారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వం కొంత ఒడ్డున పడింది. ఉప ఎన్నికలు జరిగిన అన్ని స్థానాల్లో విజయం సాధించాలని స్టాలిన్ గట్టిగానే ప్రయత్నించారు. ప్రచారాన్ని ఉధృత స్థాయిలో చేశారు. పార్లమెంటుతో పాటు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడంతో డీఎంకేకు తిరుగులేదని అనుకున్నారు. సర్వేలు కూడా స్టాలిన్ పార్టీకే ఎక్కువ స్థానాలు ఇవ్వడంతో రాష్ట్రంలో అధికార మార్పిడి తధ్యమని భావించారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాపాడుతూ వస్తోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య సయోధ్య కుదిర్చి ప్రభుత్వం పడిపోకుండా చేసిందీ మోదీ సర్కారే అన్నది కాదనలేని వాస్తవం. మోదీ సర్కార్ లేకుంటే పళిని ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేది. అయితే లోక్ సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని స్టాలిన్ భావించారు. ఒకవేళ అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించినప్పటికీ ప్రాంతీయ పార్టీల మద్దతు బీజేపీకి అవసరమని స్టాలిన్ అంచనా వేశారు.అందుకే కౌంటింగ్ జరిగే 23వ తేదీన కాంగ్రెస్ కూటమి పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా ఆయన తిరస్కరించారని చెబుతారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూటమి పార్టీలు కూర్చుందామన్న ఆయన వ్యాఖ్యలు కూడా ముందుచూపుతో చేసినవే అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సరే…లేకుంటే బీజేపీకి మెజారిటీ వచ్చినా ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమైతే డీఎంకే సహకారం అందించాలని ఒక దశలో భావించారట. దీనివల్ల రాష్ట్రంలో అధికార మార్పిడి సులువగా జరుగుతుందని, కేంద్రంలోనూ డీఎంకే భాగస్వామి అవుతుందని అనుకున్నారు. అయితే ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ అధికార మార్పిడి జరిగే అవకాశాలు లేవు. దీంతో స్టాలిన్ మరో రెండేళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే…!!