YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్..ఇంక ఇంతే సంగతులా...

 పవన్..ఇంక ఇంతే సంగతులా...

తెలుగు సినిమారంగానికి రాజకీయాలకు సుదీర్ఘమైన బంధమే ఉంది. అప్పట్లో తొలిసారిగా కొంగర జగ్గయ్య 60వ‌ దశాబ్దంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తెలుగు సినీ కవి శ్రీ శ్రీ వామపక్షాల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ వచ్చారు. ఇక ఆనాడు పలువురు నటులు రాజకీయాలపై తమ ఆసక్తి ఎప్పటికపుడు చాటుకుంటూ వచ్చిన వారే. అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్ వచ్చాక కాంగ్రెస్ తో తన సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ నాటి ముఖ్యమంత్రులకు బాగా క్లోజ్ అనిపించుకు న్నారంటారు. ఇక నందమూరి తారక రామారావు విషయానికి వస్తే అయన 1982 వరకూ ఆ ఊసే ఎత్తలేదు. అయితే మంత్రే అల్లుడుగా వచ్చిన వేళ ఆయనకు కూడా ఆసక్తి కలిగిందంటారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి రికార్డ్ సృష్టించారు.ఇక అన్నగారితో పాటు పెద్ద పరివారమే తెలుగు సినిమా రంగం నుంచి రాజకీయాల వైపు షిఫ్ట్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ, జమున, కృష్ణం రాజు. మోహన్ బాబు, శారద, సత్యనారాయణ, మురళీమోహన్ వంటి వారు ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా పనిచేశారు. అదే విధంగా జయప్రద, జయసుధ, విజయశాంతి, రోజా వంటి వారు కూడా తమ సత్తా చాటుకున్నారు. అయితే నందమూరి చేతుల్లో నుంచి చంద్రబాబుకు టీడీపీ పగ్గాలు వెళ్ళాక కొంతకాలం సినీ గ్లామర్ కనిపించినా తరువాత తగ్గిపోయింది. ఇక చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి సీటుకే గురి పెట్టారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఉమ్మడి ఏపీలో మొత్తం స్థానాలకు పోటీ చేసి కేవలం 18 ఎమ్మెల్యేలనే గెలుచుకున్నారు. మొత్తానికి చిరంజీవి రాజకీయం కేంద్ర మంత్రి పదవితో ఆగిపోయింది.అన్న చాటు తమ్ముడిగా ప్రజారాజ్యంలో పనిచేసిన పవన్ కళ్యాణ్ నాటి పరాజయాలకు ఇతరులే కారణం అనుకున్నారు. అందువల్ల ఆయన సొంతంగా జనసేన పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తాను రంగంలో ఉన్న గాజువాక, భీమవరం రెండు చోట్లా భారీ తేడాతో పవన్ ఓడిపోయారు. ఈ పరిణామం తో జనసేనకు గట్టి తొలి దెబ్బ పడిపోయింది. ఆయనకీ రాజకీయం అంటే ఏంటో, తప్పులు పొరపాట్లు ఎవరివో తెలిసివచ్చింది. ఎక్కడైనా అధినేత కనీసం గెలుస్తారు. చిరంజీవి పోటీ చేసిన రెండు చోట్ల ఒకటి నిలబెట్టుకున్నారు. పవన్ తీరు అందుకు భిన్నగా ఉంది. దాంతో ఆయ‌న పార్టీ ఇపుడు గందరగోళంలో పడింది. ముందు ఎలా తీసుకెళ్ళాలన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న తెలుగు సినిమా రంగ ప్రముఖులు భవిష్య‌త్తులో రాజకీయాల్లోకి రావడానికి జంకుతున్నారు. పార్టీలు పెట్టి అధికారం సంపాదించే రోజులు పోయాయని అంటున్నారు. ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిచేందుకు కూడా పెద్ద రిస్క్ చేయాలని తర్కించుకుంటున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వారికి రీల్ హీరోలు, రియల్ హీరోలకు మధ్య తేడా బాగా తెలుసు. అందుకే సినీ గ్లామర్ రాజకీయాల్లోకి టర్న్ అవదు అన్నది చిరంజీవి, పవన్ పార్టీలు రెండూ నిరూపించాయని అంటున్నారు. ఇంతటి చరిష్మా ఉన్న స్టార్స్ సినీ సీమలో ఇపుడు లేరు. ఒకవేళ ఉన్నా మెగా బ్రదర్స్ లా బలమైన సామజిక వర్గం అండదండలు ఉన్న వారు తక్కువ. అన్నీ ఉండి కూడా అన్నదమ్ముల పార్టీలు పడకేయడం పట్ల పెద్ద చర్చే సాగుతోంది. ఇకపై రాజకీయాల్లోకి రావాలంటే ఒకటికి పదిమార్లు సినిమా తారలు ఆలోచన చేస్తారనడానికి తాజా ఫలితాలే ఒక ఉదాహరణ.

Related Posts