భారత్ ఘనంగా ప్రజాస్వామ్య పండుగ చేసుకుంది.. దాదాపు మూడు నెలల పాటు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకుంది. అయితే, ఈ సుదీర్ఘ పండుగకు ఖర్చు మామూలుగా కాలేదు. ప్రపంచమే కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చు అయ్యింది. ఆ ఖర్చు ఎంతంటే.. రూ.60 వేల కోట్లు అని అంచనా. ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అనే సంస్థ ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈమధ్య ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఖర్చు 8.7బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.60వేల కోట్లు. ఈ మొత్తంలో 15-20 శాతం ఎన్నికల కమిషన్ చేసిన వ్యయమే. సగటున ఒక్కో నియోజకవర్గంలో రూ.100 కోట్ల మేర ఖర్చు జరిగింది. ఒక్కో ఓటరుపై పెట్టిన ఖర్చు రూ.700. ఎన్నికల నిర్వహణ, పార్టీలు ప్రచారం నిమిత్తం చేసిన వ్యయం, ఇతరత్రా ప్రలోభాలూ... వీటన్నింటినీ లెక్కెస్తే ఇంత మొత్తం తేలిందని సీఎంఎస్ ఓ నివేదికలో తెలిపింది.కాగా, ఈ ఖర్చు 2014 సార్వత్రిక ఎన్నికలకు రెట్టింపు. 2024 ఎన్నికలు వచ్చే సరికి ఈ ఖర్చు లక్ష కోట్లకు చేరే అవకాశం ఉందని సీఎంఎస్ చైర్మన్ ఎన్.భాస్కర్ రావు తెలిపారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అయిన ఖర్చు 6.5 బిలియన్ డాలర్లు.