యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో అధికార యంత్రాంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. సీఎం పేషీలో కొత్తవారి నియమించిన జగన్, బాబు హయాంలో ఉన్నవారిని తప్పించారు. తాజాగా మరి కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భారీ ఎత్తున స్థాన చలనం కలగనుంది. జూనియర్ మొదలు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకు దాదాపు 70 మందికిపైగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేయనుంది. మరో నాలుగైదు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆయా అధికారుల నేపథ్యం, పనితీరు, గత ప్రభుత్వంలో వారు అనుసరించిన వ్యవహారశైలి లాంటి అంశాలను ముఖ్యమంత్రి జగన్ క్షుణ్నంగా పరిశీలించి, బదిలీలపై కసరత్తును కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. తొలుత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోనే ఈ ప్రక్రియ మొదలుపెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు గత ప్రభుత్వ హయాంలో నియమితులైనవారే. వీరిలో చాలా మందికి ఇప్పుడు స్థానచలనం కలగనుండగా, అప్రాధాన్య పోస్టుల్లో ఉన్నవారికి కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించనున్నారు. మరి కొందర్ని వేరే జిల్లాలకు మార్చనున్నారని సమాచారం. అలాగే వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల్లో చాలా మందిని బదిలీ చేసే అవకాశం ఉంది. కీలకమైన వైద్యం, జలవనరుల లాంటి శాఖలకు ముఖ్య కార్యదర్శుల ఎంపికపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిసారించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను ముఖేశ్‌కుమార్ మీనాకు అప్పగించనున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్సైజ్ కమిషనర్, పర్యాటకశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా ఉన్న ఆయనకు ఈమేరకు జగన్ సంకేతాలిచ్చారు. గతంలో సుదీర్ఘకాలం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆదిత్యనాథ్ దాస్‌ను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సోమవారం సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఆదిత్యనాథ్‌దాస్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక, చంద్రబాబు హయాంలో సీఎం పేషీ అధికారులుగా పనిచేసిన సతీష్‌చంద్ర, సాయిప్రసాద్, రాజమౌళి, గిరిజాశంకర్‌లను ఇప్పటికే బదిలీ చేశారు. గిరిజాశంకర్‌ను పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇప్పటికే ఇద్దరు అధికారులు బాధ్యతలు చేపట్టారు. మరో ఇద్దరిని నియమించనున్నారు.