Highlights
- పోలీస్ ప్రచారం వాస్తవం కాదు
- హరిభూషణ్,
- బడే చొక్కారావు,
- కంకణాల రాజిరెడ్డిలు చనిపోలేదు
- ఒక ద్రోహి చేసిన పనికి పోలీసులు దాడి
- మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్
కార్పోరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేసారు. ప్రజల సహకారంతో ఈ దాడులన్నింటినీ తిప్పికొడతామన్నారు. ఈ క్రమంలో ఇకపై తాము టీఆర్ఎస్ నేతలపై దాడులను ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ప్రచారం చేస్తున్నట్లు ఈ ఎన్‌కౌంటర్‌లో హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి చనిపోలేదన్నారు. ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి ఏకపక్షంగా కాల్పులు జరిపారు.ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 10 మందిలో జిల్లా కమిటీ సభ్యుడు హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నారు. మిగతా కామ్రేడ్స్ అంతా చత్తీస్‌గడ్‌లోని సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన వారు. కార్పొరేట్ శక్తులకు నీళ్లు, భూమిని దారాదత్తం చేసేందుకే నియంత కేసీఆర్ ఈ విధమైన బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు ఇదంతా జరిగింది. హిందుత్వ నాయకుడు రమణ్‌సింగ్, నియంత కేసీఆర్‌లు కలిసికట్టుగా ఆదివాసీలపై, ప్రశ్నించే వారిని నిర్మూలించేందుకు దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత చనిపోయింది ఎవరనేది తెలిసినప్పటికీ పోలీసులు ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించడం కోసం అబద్దాలు ప్రచారం చేశారు. ముఖ్యనాయకులు చనిపోయారని ప్రచారం చేసి ప్రజల మనో ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని జగన్ అన్నారు.