యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఈ క్రమంలో రెండో సారి కూడా అధికారంలోకివచ్చేందుకు అనేక మార్గాలను అనుసరించారు. ఈ క్రమంలోనే తన హావభావాలను పూర్తిగా మార్పు చేసు కున్నారు. తన ఆహార్యం ఎలా ఉన్నా.. తన మాటల తీరును మాత్రం మార్చుకున్నారు. వరుసగా అదికారంలోకి రావడం ద్వారా విభజన కష్టాలతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని బాబు అనుకున్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పారు. ఇక ఈ క్రమంలోనే ఆయన ఇతర పార్టీల నుంచి కూడా నాయకులను చేర్చుకున్నారు. గెలుపు గుర్రాలకు మాత్రమే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఇక, ఇదేసమయంలో చంద్రబాబు సరికొత్త ఫార్ములాను తెరమీదికి తెచ్చారు. వివిధ పార్టీల నుంచి నాయకులు వచ్చి టీడీపీలో చేరడంతో అనేక నియోజకవర్గాల్లో విభేదాలు అలాగే ఉండిపోయాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలోకి నాయకులు భారీగానే చేరారు. అయితే, ఇలా చేరిన నాయకులకు, అప్పటికే టీడీపీలో ఉన్న నాయకులకు మధ్య తరతరాల నుంచి కూడా విభేదాలు ఉన్న విషయాన్ని గమనించాలి. దీంతో నాయకుల మధ్య విభేదాలు అలానే కొనసాగితే.. ఎన్నికల్లో తీవ్ర నష్టం రావడం ఖాయమని గుర్తించిన చంద్రబాబు వెంటనే దీనికి విరుగుడుగా.. ఆయా నాయకుల మధ్య సయోధ్య పెంచారు.ప్రధానంగా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఇలాంటి ప్రయత్నాలు సాగాయి. అంటే.. నిన్న మొన్నటి వరకు కత్తులు నూరుకుని, ఒకరిపై ఒకరు హత్యా కేసులు పెట్టుకున్న నాయకులను కూడా ఏకతాటిపైకి తీసుకు వచ్చారు చంద్రబాబు. దీంతో కడపలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కి మధ్య సయోధ్య చేశారు. అదేవిధంగా అనంతపురంలో జేసీ వర్గానికి, పరిటాల వర్గానికి మధ్య సంధి కుదిర్చారు. ఈ రెండు కుటుంబాలు కూడా ఒకటి ఒక పార్టీలో ఉంటే.. మరొకటి మరో పార్టీలో ఉండేది. ఇక, కర్నూలు జిల్లాకు వచ్చేసరికి కొన్ని ఏళ్లతరబడి వైరం ఉన్న కోట్ల, కేఈ కుటుంబాల మధ్య కూడా బాబు సయోద్య కుదిర్చారు.ఇక, ప్రకాశంలో గొట్టిపాటి-కరణం వర్గాల మధ్య కూడా అతి కష్టంమీద సయోధ్య చేశారు చంద్రబాబు. విజయవాడకు వచ్చే సరికి.. వంగవీటి-దేవినేని వర్గాల మధ్య సయోద్య కూర్చారు. దీంతో ఆయా కుటుంబాలు మొత్తంగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తాయని, వారు గెలిచి.. తనను, పార్టీని కూడా గెలిపిస్తారని చంద్రబాబు భావించారు. అయితే, ఈ మొత్తం బ్యాచ్‌లో ఒక్క గొట్టిపాటి-కరణం లు తప్ప మిగిలిన వారంతా ఘోరంగా పరాజయం పాలయ్యారు. అంటే చంద్రబాబు ఆశించిన రాజకీయ ప్రజాస్వామ్యం.. కింది స్థాయి కేడర్‌లో మాత్రం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఎక్కడికక్కడ ఏ వర్గానికి ఆ వర్గమే అన్నట్టుగా పనిచేసింది తప్ప.. చంద్రబాబు ఆశించిన విధంగా చేతులు కలిపి ముందుకు సాగింది అంటూ ఏమీ లేదు. దీంతో రాజకీయంగా చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఫెయిలయిందని అంటున్నారు