అఖండ విజయంతో మరోసారి కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోదీ సర్కారు.. వచ్చే నెల 5న పార్లమెంట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను వార్షిక బడ్జెట్‌ను ప్రకటించనున్నది. ఈ క్రమంలో నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ కసరత్తు మొదలవగా, సమాచారం బయటకు పొక్కకుండా నెల రోజులపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, ఉద్యోగులను దిగ్భంధించేశారు. వీరంతా ఇక అక్కడి
ఆఫీసులకే పరిమితం కానున్నారు. బడ్జెట్ ప్రకటన తర్వాతే వీరిని బయిటకు పంపిస్తారు. మీడియాకుగానీ, మరెవరికీగానీ ప్రవేశం లేదు. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా ఉద్యోగులు కార్యాలయాలకే పరిమితమయ్యారు. బడ్జెట్ రహస్యాలను కాపాడటంలో భాగంగా ఏటా జరిగే తంతే ఇది. కాగా, కొత్త ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి వార్షిక బడ్జెట్‌ను ప్రకటించనుండగా, దేశ వృద్ధిరేటు ఐదేండ్ల కనిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో ఎలాంటి ప్రకటనలు ఉంటాయోనని వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.ఈ నెల 17 నుంచి మొదలయ్యే ఈ 17వ లోక్‌సభ తొలి సమావేశాలు వచ్చే నెల 26దాకా జరుగనున్నాయి. 2019-20 ఆర్థిక సర్వే జూలై 4న ఉంటుంది. ఆ మరుసటి రోజే బడ్జెట్ ప్రకటన ఉండనున్నది.సీతారామన్ బడ్జెట్ బృందంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్, ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌లతోపాటు ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, వ్యయ కార్యదర్శి గిరీశ్ చంద్ర ముర్ము, రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, దీపం కార్యదర్శి అతను చక్రబర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు ఉన్నారు. చాలావరకు
కంప్యూటర్లను ఆపేసి ఉంచగా, భద్రతా సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, ఇంటిలిజెన్స్ బ్యూరో పహారాలో బడ్జెట్ పనులు జరుగనున్నాయి. ఇప్పటికే ఉద్యోగులందరి సెలవులు రద్దవగా, పైస్థాయిలో ఉన్న అత్యంత ఉన్నతాధికారులు మాత్రమే ఇండ్లకు వెళ్లే అవకాశముంది.