యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సచివాలయంలోని పలువురు కీలక ఐఏఎస్ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం పలువురు ఎస్పీలు, డీఎస్పీలను బదిలీలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఐపీఎస్ అధికారుల బదిలీపై ఇప్పటికే ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన డీజీపీ గౌతం సవాంగ్ ఇవాళ ఉదయం తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు.
పోలీసు ప్రధాన కార్యాలయంలోని పలువురు ఐజీలు సహా జోన్‌ల వారీగా ఉన్న ఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఎవరెవరిని బదిలీ చేయాలి, ఎవరికి ప్రాధాన్యత పోస్టులు ఇవ్వాలి అనే అంశంపై సీఎం జగన్.. గౌతం సవాంగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు పోలీసు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. వీరిని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. సమర్ధత కలిగిన పోలీసు అధికారులకు నియామకాల్లో పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు తుదిజాబితాను సిద్ధం చేసిన అనంతరం ఇవాళ సాయంత్రం లేదా రేపు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించే అవకాశాలు ఉన్నాయి.