బెజవాడ టీడీపీలో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని నానితో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భేటీ అయ్యారు. నాని విప్ పదవిని తిరస్కరించిన నేపథ్యంలో ఆయనను కలవడానికి జయదేవ్ వెళ్లారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నాని, జయదేవ్ ఆంతరంగికంగా చర్చించుకుంటున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో కేశినేని నాని చేసిన పోస్టింగ్స్‌పై కలకలం రేగింది.టీడీపీ లోక్‌సభాపక్ష నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను, ఉపనేతగా, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం నియమించారు. అయితే, ఈ పదవిని తాను తిరస్కరిస్తున్నట్టు తన ఫేస్‌బుక్‌లో కేశినేని బుధవారం ఉదయం పోస్ట్ చేయడంతో ఆ పార్టీలో కలకలం రేపుతోంది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నానిని నియమించి 24 గంటలు కూడా గడవకముందే ఆ పదవులను తాను తీసుకోనంటూ కేశినేని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. ఎంపీ కేశినేని నాని నిర్ణయంపై పార్టీ స్పందించాల్సి ఉంది. ‘లోక్‌సభలో పార్టీ విప్‌గా నియమించినందుకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు.. కానీ ఈ పదవిని బాధ్యతాయుతంగా నిర్వహించడాని తాను సరైన వ్యక్తిని కాదు.. నా కంటే సమర్ధవంతమైన నేతను నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. విజయవాడ ప్రజలు నన్ను ఆశీర్వదించి, మళ్లీ పార్లమెంటు సభ్యుడిగా అవకాశం ఇచ్చారు.. ఈ పదవి కంటే నియోజకవర్గంలో సేవ చేయడమే తనకు సంతోషంగా ఉంటుంది.. తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబుకు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనిని తిరస్కరిస్తున్నందుకు క్షమించాలని’కేశినేని తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. కాగా, కేశినేని టీడీపీని వీడతారంటూ ప్రచారం సాగుతోంది. కొద్దిరోజుల కిందట కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆయన కలవడం ఈ వార్తలకు బలం చేకూరేలా ఉంది. గడ్కరీతో భేటీ టీడీపీలో చర్చకు తెరతీసింది. ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. అలాగే, చాలామంది టీడీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాగా వేయడానికి పావులు కదుపుతోన్న కాషాయ పార్టీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని కేశినేని నాని తిరస్కరించడమే ఇందుకు కారణం. పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ గల్లా జయదేవ్‌ను, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ రామ్మోహన్ నాయుడును, విప్‌గా కేశినేని నానిని నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే.. చంద్రబాబు తనను విప్‌గా నియమిస్తూ ప్రకటించిన నిర్ణయాన్ని నాని సున్నితంగా తిరస్కరించారు. చంద్రబాబు తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు.మీడియాతో మాట్లాడటానికి నాని విముఖత వ్యక్తం చేశారు. తానేం చెప్పాలో అది ఫేస్ బుక్‌లో చెప్పానని, దయచేసి దీనిని రాజకీయం చేయొద్దని ఆయన కోరారు. తనకు అంత పెద్ద పదవి వద్దని, దానిని ఎవరి కన్నా ఇవ్వండని పోస్ట్ చేశారు. కేశినేని నాని నిర్ణయంపై టీడీపీలో కలకలం రేగింది. ఇటీవల నాని టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారని, బీజేపీలో చేరనున్నారని ప్రచారం కూడా జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన భేటీ కావడంతో ఈ సందేహాలు మరింత బలపడ్డాయి. అయితే.. ఈ వార్తలపై కూడా నాని స్పందించారు. బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని, తనకు ఆ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ ఇదే.