YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ పంతం నెగ్గినట్టుందే...

రాహుల్ పంతం నెగ్గినట్టుందే...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా అస్త్రంతో పార్టీలో సక్సెస్ అయినట్లే కన్పిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికీ తన రాజీనామాకు కట్టుబడి ఉన్నారు. ఎంతమంది సీనియర్లు చెప్పినా ససేమిరా అంటున్నారు. తన స్థానంలో మరోనేతను ఎన్నుకునే వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగుతానని ఇప్పటికే రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే రాహుల్ రాజీనామాతో అన్ని రాష్ట్రాల్లో ప్రకంపనలు బయలుదేరాయి.పార్టీ కోసం పని చేయకుండా కేవలం పదవుల కోసమే వెంపర్లాడే నేతలను రాహుల్ టార్గెట్ చేసినట్లు కన్పిస్తుంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. మోదీ హవా ముందు రాహుల్ తేలిపోయారు. సాక్షాత్తూ అమేధీ నుంచి రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీ ఓటమికి తానే నైతిక బాధ్యత వహించాలని రాహుల్ డిసైడ్ అయ్యారు. దీంతో పాటు సీనియర్ల హోదాలో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరును రాహుల్ తప్పుపడుతున్నారు. పార్టీ ఇలాగే ఉంటే మరో ఐదేళ్లయినా పుంజుకోలేదన్నది రాహుల్ గాంధీ భావన. ప్రజల్లో తిరగకుండా కేవలం పదవులను పట్టుకుని వేళ్లాడుతున్న నేతలను ఇంటికి పంపాలన్నది రాహుల్ ఆలోచనగా కన్పిస్తుంది.తన రాజీనామా అస్త్రంతో పార్టీని ప్రక్షాళన చేయాలన్నది రాహుల్ వ్యూహంగా ఉంది. సీనియర్లను బయటకు పంపి, యువనేతలను ప్రోత్సహించాలన్నది రాహుల్ గాంధీ ఎత్తుగడ. ఇప్పటికే ఆరు రాష్ట్రాలకు చెందిన పీసీసీ చీఫ్ లు తమ పదవులకు రాజీనామా చేసేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అధ్యక్షుడిని మాత్రమే కుదిపేయలేదు. వివిధ రాష్ట్రాల పార్టీ చీఫ్ లపైన కూడా ఆ ప్రభావం పడింది. దీంతో రాష్ట్రాల కమిటీలతో పాటు ఏఐసీసీని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని రాహుల్ భావిస్తున్నారు.రాహుల్ గాంధీ రాజీనామాతో సీనియర్లు కూడా దారికి వస్తున్నట్లే కన్పిస్తుంది. పనికి రాని నేతలు, కుటుంబ స్వార్థం కోసం పనిచేసే నాయకులను తప్పించే పనిలో రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో యువత, వెనుకబడిన సామాజిక వర్గాల వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది
రాహుల్ నిర్ణయంగా తెలుస్తోంది. కొత్త నాయకత్వం వస్తేనే పార్టీ తిరిగి పుంజుకోగలదని భావిస్తున్నారు. మరికొంత మంది సీనియర్లు కూడా తమ పదవులకు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పార్టీ గెలవకపోయినా… పార్టీని ప్రక్షాళన చేసేందుకు మాత్రం ఒక అవకాశం దొరికిందన్నది నిజం.

Related Posts