యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఓలా, ఉబెర్ క్యాబ్ లను బుక్ చేసుకుంటున్న ప్రయాణికులు యాప్లోని లోపాలతో ఇబ్బందులు పడుతున్నారు. కస్టమర్ యాప్ లో ఒక రేటు, డ్రైవర్ కు చూపించే యాప్ లో మరో రేటు ఉంటోంది.దీంతో అసలు బిల్లు ఎంత అన్న దానిపై అటు కస్టమర్ కు గానీ ఇటు డ్రైవర్ గానీ స్పష్టత ఉండటం లేదు. కస్టమర్ తన యాప్ లో ఎంత బిల్లు ఉంటే అంతే చెల్లిస్తానని చెబుతుండగా డ్రైవర్ తన యాప్ లో ఉన్న రేటు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నాడు. ఫలితంగా నిత్యం ఓలా, ఉబెర్ డ్రైవర్లతో కస్టమర్లకు గొడవలు జరుగుతున్నాయి. ఈ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చిన క్యాబ్ నిర్వాహక సంస్థలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఎవరైనా ప్రయాణికుడు కచ్చితంగా ఇదేంటనీ ప్రశ్నిస్తే కస్టమర్ యాప్ లో ఉన్నంతే తీసుకోవాలని కస్టమర్ కేర్ నుంచి డ్రైవర్లకు సూచనలు అందుతున్నాయి. లేదంటే డ్రైవర్లు తమ యాప్ లో నమోదైనంతా చెల్లించాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. డ్రైవర్ల యాప్ లో నమోదైనంతా తమ వద్ద వసూలు చేస్తారు కనుక తాము కస్టమర్ల యాప్ లో ఎంత నమోదైందన్న దానితో సంబంధం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. ఐతే పదో ఇరవై రూపాయలు తేడా ఉంటే పెద్ద సమస్య లేదు. కానీ కస్టమర్ కు చూపించే రేటుకు డ్రైవర్ కు చూపించే రేటు వందల్లో తేడా ఉంటోంది. ఇటీవలే ఓ కస్టమర్ కు తన యాప్ లో 350 రూపాయల బిల్లు చూపిస్తే డ్రైవర్ యాప్ లో అది 1100 రూపాయలుగా నమోదైంది. దీంతో కస్టమర్ షాక్ గురయ్యాడు.ఓలా, ఉబెర్ బుకింగ్ లలో చాలా వరకు ప్రయాణికులే నష్టపోవాల్సి వస్తోంది. డ్రైవర్ల వద్ద ఉన్న యాప్ రేట్లు కచ్చితంగా చెల్లించాల్సి రావడంతో ఎక్కువైన సరే చెల్లిస్తున్నారు. ఐతే ఇలా కస్టమర్ కు ఒక రేటు, డ్రైవర్ కు ఒకరేటు రావడానికి పలు కారణాలున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. గతంలో ఏదైనా బిల్లు పెండింగ్ ఉన్నప్పటికీ లేదంటే బుకింగ్ లు క్యాన్సల్ చేసినప్పటికీ వాటి ఛార్జీలు డ్రైవర్ల యాప్ కనిపిస్తున్నాయంటున్నారు. ఇది కస్టమర్ యాప్ లో కనిపించకపోవడంతో సమస్య ఎదురవుతోంది. కొన్ని సందర్భాల్లో రద్దీ తక్కువ ఉన్న సమయంలో రైడ్ బుక్ చేస్తే ఛార్జీలు తక్కువగా చూపిస్తున్నాయి. రైడ్ పూర్తయ్యే సరికి పీక్ అవర్స్ ఉంటే ఇది పెరుగుతోంది. ఇలా మార్పులు జరిగేవన్నీ కస్టమర్ యాప్ తో పాటు డ్రైవర్ యాప్ లోనూ చూపించాలి. కానీ
అలా జరగకపోవడంతో ఇద్దరికీ వేర్వేరు రేట్లు చూపిస్తున్నాయి. తమకు ఇబ్బందిగా మారిందంటూ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. యాప్ ల ద్వారా డబ్బు చెల్లిస్తే బదిలీ కావడం లేదంటూ ప్రయాణికుల నుంచి ఆన్ లైన్ పేమెంట్ కు డ్రైవర్లు నో చెబుతున్నారు. యాప్ లో డబ్బులు ఉన్నా డబ్బు చెల్లించాల్సి రావడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు