యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు విప్ పదవి నానికి కేటాయించడం, ఆ పదవిని నాని తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో
చర్చనీయాంశంగా మారింది. కేశినేని నాని పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని అలకబూనారని, రేపోమాపో బీజేపీలోకి వెళతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేశినేని నానితో, గల్లా జయదేవ్‌తో బుధవారం భేటీ అయ్యారు. అయినప్పటికీ నాని అలకపాన్పు వీడలేదని తెలిసింది. అలకబూనిన కేశినేనిని బుజ్జగించేందుకు చంద్రబాబుతో మరోసారి గల్లా జయదేవ్ భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని జయదేవ్ చంద్రబాబుకు స్పష్టం చేశారు. పార్లమెంటరీ పార్టీ పదవి గల్లాకు కేటాయించి, తనకు విప్ పదవి కేటాయించడంపై నాని అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు కూడా కలకలం రేపాయి. దీంతో పార్లమెంటరీ పార్టీ పదవిని వదులుకునేందుకు గల్లా సిద్ధపడ్డారు. గల్లా అభ్యర్థనపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఒక అంశం మరోపక్క తనకు పార్లమెంటరీ పార్టీ పదవి కేటాయిస్తే కేశినేని నాని ఎలా స్పందిస్తారనేది అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.